Monday, December 23, 2024

నాలుగు రోజులుగా నిలిచిపోయిన మిషన్ భగీరథ తాగునీరు

నీటి కోసం పడరాని పాట్లు పడుతున్న ప్రజలు

పడకేసిన డీ ఫ్లోరైడ్ పథకాలు

కరెంటు బిల్లుల భారంతో గ్రామాల్లోని బోరు బావులకు తాళాలు

గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల ప్రజలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడే ఉద్దేశంతో గత ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పేరిట ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందించే పలక రచన చేసింది. ఆనాటి ప్రభుత్వం ఉద్దేశం మంచిదైనప్పటికీ లక్ష్యం మాత్రం నేటికీ నెరవేరలేదు. సుమారు 50 వేల కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి తాగునీటిని అందించేందుకు ఎన్నో రకాల వసతులను కల్పించే ప్రయత్నం చేశారు. సహజ సిద్ధమైన నీటిని అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశం మంచిదైనప్పటికీ స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించలేకపోయారనే నిజాన్ని మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే. సహజ సిద్ధమైన నీరును అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు కానీ, ఎన్నో లోపాలు ఎన్నో తట్టిదాలతో ఆ పథకం ద్వారా కొంతమేరకు ప్రజలకు సౌకర్యవంతం కలిగిన అసౌకర్యం ఎక్కువగా కలిగిందని చెప్పవచ్చు. గత నాలుగు రోజులుగా సింగూరు నుండి సరఫరా చేయాల్సిన నీటి సరఫరా నిలిచిపోయింది. బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల ప్రజలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు తాగునీటిని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సింగూర్ నీటి సరఫరా మాటేమిటి

సహజ సిద్ధమైన స్వచ్ఛమైన నీటిని అందించే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వం దూరాన్ని వ్యయాన్ని ఆలోచించకుండా సింగూరు నుండి సాలూర వరకు తాగునీటిని అందించేందుకు భారీ పైపు లైన్లను ఏర్పాటు చేశారు. ఆనాడే పైపుల కొనుగోలు నాణ్యతలో ఎన్నో తప్పిదాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. నాణ్యత లోపం ఉన్న పైపులను సైతం ఉపయోగించడంతో నేటికీ నీటి సరఫరా లో అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ప్రతినిత్యం నీటి సరఫరా చేయాల్సిన సింగూరు నీరు ప్రతిసారి ఏదో ఒక కారణంతో రెండు నుంచి ఐదు ఆరు రోజులు నీటి సరఫరా నిలిపి వేస్తున్నారు. ఈ పథకాల నిర్వహణను ఆనాడు పథకాలు నిర్మించిన కాంట్రాక్టర్లు చేతిలో పెట్టడం ప్రజలకు శాపంగా మారింది. కాంట్రాక్టర్లు బడా బాబులు కావడంతో వారు చెప్పిందే విధంగా నేటికీ కొనసాగుతూనే ఉంది. మిషన్ భగీరథ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకే ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. నిర్వహణ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు బిల్లులను కాంట్రాక్టర్కు చెల్లిస్తుంది. కాంట్రాక్టర్ రాష్ట్రంలోనే ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యక్తి కావడంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో నిస్సహాయంగా ఉండి పోతున్నారు. అధికారులు కఠినంగా వ్యవహరిస్తే కాంట్రాక్టర్ తన సత్తా చూపిస్తూ ఉంటారు. వారికి ఎదురు చెప్పిన అధికారులకు గతంలో ఎంతోమందినకి స్థానచలనం కల్పించారు. బదిలీ వేటు దాకా ఎందుకు తెచ్చుకొని ఇబ్బందులు పడాలన్న చందంగా నేటికీ అధికారులు వారికి వత్తాసు పలుకుతూ ఉండడంతో నీటి సరఫరాలో ఎన్ని ఇబ్బందులు ఏర్పడిన అధికారులు కాంట్రాక్టర్లు పక్షానే నిల్వాల్సి వస్తుంది.

గ్రామాల్లో బోరుబావులకు మూతేసిన అధికారులు

గతంలో గ్రామాల్లోని బోరు బావుల ద్వారానే ప్రజలకు తాగునీరు అందించేవారు. స్వచ్ఛమైన నీటిని అందించే సంకల్పంతో ప్రభుత్వం మిషన్ భగీరథ పేరిట గ్రామాల్లో ఉన్న బోరుబావులకు తాళాలు వేయించారు. గ్రామాల్లోని బోరు బావుల నిర్వహణ కరెంట్ బిల్లుల భారాన్ని ఆలోచన చేసి అధికారులు గ్రామాల్లో ఉన్న బోరు బావులను మూసివేయాలని అధికారులు గ్రామ కార్యదర్శులను సర్పంచ్ లను ఆనాడు ఆదేశించారు. వారి ఆదేశాలతో గ్రామాల్లోని బోరు బావులను నిలిపివేశారు. మిషన్ భగీరథ నీటి సరఫరా పై గ్రామాల్లోని ప్రజలు ఆనాటి నుండి ఆధారపడాల్సి వచ్చింది. మరి ఇలా నాలుగు రోజులు కోసారి మిషన్ భగీరథ నీటి సరఫరా నాలుగైదు రోజులు నిలిచిపోతే గ్రామాల్లోని ప్రజల పరిస్థితి ఆలోచన చేయాల్సిన అధికారులు ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందన్న ప్రజలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం బోరుబావులను నిలిపివేయాలని ఆదేశించినప్పటికీ గత ఏడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లోని బోరుబావులను యధావిధిగా కొనసాగించాలని హుకుం జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను పరిగణలో తీసుకోకుండా గ్రామాల్లోని బోరుబావులను నేటికీ మరమ్మత్తులు చేపట్టడం లేదు. సర్పంచుల కాల పరిమితి ముగిసిపోయి పది నెలలు గడిచాయి. సర్పంచులు లేకపోవడంతో గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించే నాధుడే కరువయ్యారు. ప్రభుత్వం సర్పంచ్ల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేక అధికారులు ఏనాడు గ్రామాల్లో కొచ్చి గ్రామ సమస్యలను ఆలోచన చేసి పరిష్కరించిన పాపాన పోలేదు.

పడకేసిన డీ ఫ్లోరైడ్ నీటి పథకాలు

గత 30 ఏళ్ల క్రితమే ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆనాటి రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న గ్రామాలకు ఫ్లోరైడ్ లేని నీటిని సరఫరా చేసే విధంగా ఎన్నో పథకాలను ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటిని అందించారు. బాన్సువాడ నియోజకవర్గం లో కారేగాం, పోతంగల్, కిష్టాపూర్, బాన్సువాడ పథకాల పేరిట మంజీరా నదిని ఆధారంగా చేసుకుని ఆనాడు కోట్లాది రూపాయలతో నీటి పథకాలను ఏర్పాటుచేసి వందలాది గ్రామాలకు తాగునీటిని అందించారు. మిషన్ భగీరథ పేరిట అటువంటి పథకాలకు అధికారులు చరమగీతం పాడారు. ఇప్పటికైనా ఎంతో దూరం నుండి తాగునీటిని అందించడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాన్సువాడ నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో ఉన్న డీ ఫ్లోరైడ్ నీటి పథకాలు గ్రామాలకు అతి సమీపంలో అంచునే ఉన్నాయి. డీ ఫ్లోరైడ్ నేటి పథకాలను పునరుద్ధరించి ప్రజలకు తాగునీటిని అందించాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కారేగాం డీ ఫ్లోరైడ్ పధకం మాటేమిటి

నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం పరిధిలోని కారేగం గ్రామ సమీపంలో 21 గ్రామాలకు నీటిని సరఫరా చేసేందుకు ఆనాడు తాగునీటి పథకాన్ని నిర్మించారు. 30 ఏళ్ల పాటు ఈ పథకం ద్వారా 20 గ్రామాలకు తాగునీరు సరఫరా జరిగింది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఈ పథకానికి తాళాలు వేయడంతో ఈ ప్రాంతంలోని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇట్టి విషయాన్ని ఎన్నో పర్యాయాలు పాలకులకు, సంబంధిత అధికారుల దృష్టికి ప్రజలు తీసుకువెళ్లడం జరిగింది. అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ప్రజల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంజీరా అంచనా ఉన్న గ్రామాలకు సైతం మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తామంటూ అధికారులు ది ఫ్లోరైడ్ పథకాలకు మూత వేయడం ప్రజలను ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఎక్కడో 100 కిలోమీటర్ల లలో ఉన్న సింగూరు ప్రాజెక్టు నుండి ఈ ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించేందుకు అధికారులు కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రాంతంలోని ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు కలగకుండ్డ మంజీరా నదిని ఆధారంగా చేసుకుని నిర్మించిన డీప్ ఫ్లోరైడ్ నీటి పథకాలను వెంటనే పునరుద్ధరించాలి.

మరో రెండు రోజుల్లో నీటిని సరఫరా చేస్తాం

ప్రాజెక్ట్ అధికారి రాజశేఖర్ రెడ్డి వెల్లడి

సింగూర్ ప్రాజెక్ట్ నుండి జరుగుతున్న నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని, మరో రెండు రోజుల్లో నీటి సరఫరాను చేస్తామని ఈ ప్రాంతం పనులను పర్యవేక్షిస్తున్న అధికారి రాజశేఖర్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను చేపడుతున్న ఉన్నతాధికారులు మాత్రం ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఉన్నతాధికారులు ప్రజా సమస్యలు నిర్లక్ష్యం చేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కారేగాం డీ ఫ్లోరైడ్ అస్తవ్యస్తం

కారేగాం డీ ఫ్లోరైడ్ నేటి పథకం ద్వారా 30 ఏళ్ల పాటు 20 గ్రామాలకు మంజీరా నీటిని అందించిన ఘనత ఉంది. అటువంటి నీటి పథకాన్ని మూతవేశారు. ఇప్పటికీ ఈ పథకం ద్వారా ఓకే ఒక్క కారేదాం గ్రామానికి నీటిని సరఫరా చేస్తున్నారు. మంజీరా నుండి పైప్లైన్ ద్వారా నీటిని ఫిల్టర్ బెడ్ల వద్దకు చేరుస్తారు. ఫిల్టర్ బెడ్ల వద్ద నీటిని శుద్ధికరిస్తారు. శుద్ధమైన నీటిని పంపుల ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తారు. గతంలో కారేగాం డీ ఫ్లోరైడ్ నీటి పథకాన్ని చూసి ఎంతోమంది సంతోషం వ్యక్తం చేసేవారు. ఈ పథకం పరిధిలో లేని గ్రామాలు వారు సైతం ఈ పథకం వద్దకు వచ్చి తాగునీటిని డబ్బాల్లో తీసుకుని వెళ్లేవారు. శుభకార్యాలకు సైతం ఈ పథకం వద్ద నుండి ట్యాంకర్లతో తాగునీటిని తీసుకు వెళుతూ ఉండేవారు. అటువంటి పథకాన్ని అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేసి అస్తవ్యస్తంగా పథకం నిర్వహణ చేపడుతున్నారు. ఫిల్టర్ బెడ్లలో పెద్ద ఎత్తున నాచు కట్టడం, ఫిల్టర్ బెడ్లలో ఇసుకను మార్చకపోవడంతో నీరు ఫిల్టర్ కాకపోవడం నీటి నాణ్యతలో ఎన్నో లోపాలు తల ఎత్తుతూ ఉన్నాయి. ఇటువంటి నీటి పథకాలకు పునర్జీవం పోసి ఈ ప్రాంత ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. ఈ పథకాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు తాగునీరును అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. గత 15 రోజుల క్రితం ఈ ప్రాంతంలోని టాక్లి గ్రామానికి గత నెల రోజుల నుండి నీటి సరఫరా కావడం లేదని ఆ గ్రామ ప్రజలు గగ్గోలు పెట్టి రోడ్డు ఎక్కారు. బాన్సువాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి విషయాన్నీ తెలుసుకుని సంబంధిత అధికారులను మాట్లాడి వెంటనే ఆ గ్రామానికి నేటి సరఫరా అయ్యేటట్లు చూశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular