6.56 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క
నిజామాబాద్ జూలై 4 ద్రోణ
సామాన్య ప్రజల సంక్షేమం,అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ మంత్రి సీతక్క పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కలిసి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో చైర్మన్ ముప్ప గంగారెడ్డి అధ్యక్షతన రూ.6.56 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ పనుల్లో మార్కెట్ కమిటీ నిర్వహణ, ఆధునిక షెడ్ల నిర్మాణం, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి.రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది” అనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని స్పష్టం మంత్రి చేశారు. రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ రైతుల సంక్షేమంలో ఎక్కడా రాజీ పడటం లేదని అన్నారు. రైతు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తూ, వారికి గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, ప్రజాప్రతినిధులు, రైతులు చేసిన ప్రతి వినతిని సానుకూలంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజామాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందని, అందుకే జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రైతులు, కార్మికులు, సామాన్య ప్రజల సహకారంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించిన మంత్రి, ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తేనని, రైతుల కష్టాలు ప్రత్యక్షంగా తెలిసిన నాయకత్వం రాష్ట్రాన్ని నడిపిస్తోందని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని, “మీకోసమే మేము ఉన్నాం” అనే భావనతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉండడం అభినందనీయమని కొనియాడారు.నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ, మంత్రి సీతక్క రాకతో పాటు వానమ్మ కూడా రావడం రైతులకు శుభసూచకమని అన్నారు. గత పాలనలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లను కూడా నియమించకుండా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపడుతూ మార్కెట్ యార్డులను బలోపేతం చేస్తోందన్నారు.కార్మిక సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, వ్యవసాయ మార్కెట్లలో ఆధునిక వసతులు కల్పించి రైతులకు మరింత భరోసా కల్పిస్తామని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు అన్ని రకాల సౌకర్యాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.రూ.6.56 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు పూర్తయితే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మరింత ఆధునికంగా రూపుదిద్దుకుని రైతులకు మెరుగైన సేవలు అందిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు, కార్మిక, సామాన్య ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు, నియోజకవర్గ, జిల్లా నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






