మంజీరా చెక్‌డ్యామ్‌లతో పెరిగిన భూగర్భ జలాలు

పోచారం కు కృతజ్ఞతలు తెలిపిన రైతులు

కామారెడ్డి ప్రతినిధి నవంబర్ 29, ద్రోణ

బాన్సువాడ – జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మంజీరా నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ల ఫలితంగా భూగర్భ జలాలు గణనీయంగా పెరగడంతో బండపల్లి, గుండె నమ్లి, వాజిద్ నగర్, పూల్కల్, బండ రెంజల్ గ్రామాలకు చెందిన రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ని కలిసి ఆత్మీయంగా తమ సంతోషాన్ని పంచుకున్నారు.
గతంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు, బావుల్లో నీరు లేక పంటలు సాగు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారమని తెలిపారు. ప్రస్తుతం చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీటి లభ్యత మెరుగుపడిందని, రెండు పంటలు సమృద్ధిగా సాగు చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని ఆనందం వ్యక్తం చేశారు.
తమ జీవితాల్లో వచ్చిన ఈ సానుకూల మార్పుకు కృషి చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.రైతులను కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలు, నాయకులు రైతుల పక్షాన చిత్తశుద్ధితో పనిచేస్తే రైతులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే స్థాయి నుంచి బ్యాంకుల్లో డబ్బులు జమ చేసే స్థాయికి ఎదుగుతారు. రైతన్న చేయి ఎప్పుడూ కింద ఉండకూడదు.నలుగురికి సాయం చేసే స్థాయిలో పైన ఉండాలి. రైతు కుటుంబాలు సంతోషంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేయాలి.
నా నియోజకవర్గంలోని రైతు తన సొంత పెట్టుబడితో వ్యవసాయం చేసుకునే పరిస్థితులు కల్పించడమే నా లక్ష్యం.
రాష్ట్ర జనాభాలో మూడో వంతు మంది రైతు కుటుంబాలకు చెందినవారు. పట్టణాలను మినహాయిస్తే గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 75 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు కోటి 50 లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా, దాదాపు 70 లక్షల మంది రైతులు ఉన్నారు.
ఒక వ్యాపారస్తుడు మొదట బ్యాంకు నుంచి రుణం తీసుకొని వ్యాపారం ప్రారంభిస్తాడు. వచ్చిన లాభాలతో తర్వాతి సంవత్సరం తన పెట్టుబడిని సమకూర్చుకొని వ్యాపారాన్ని కొనసాగిస్తాడు. కానీ రైతు పరిస్థితి అలా లేదు. ప్రతి సంవత్సరం పంట సాగు కోసం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం, పంట అమ్మిన డబ్బులతో అప్పులు చెల్లించడం, తిరిగి తర్వాతి పంట కోసం అదే బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం జరుగుతోంది.
దేశానికి అన్నం పెట్టే రైతు ప్రతి సంవత్సరం అప్పులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి బాధాకరమన్నారు.
దీనికి ప్రధాన కారణాలు పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, సకాలంలో సాగునీరు అందకపోవడం, ప్రకృతి పరిస్థితుల వల్ల పంటలు సరిగ్గా పండకపోవడం.
ఒక రైతుకు పంట సమృద్ధిగా పండాలంటే భూమి, నాణ్యమైన విత్తనం, రైతు కష్టం, నీరు అనే నాలుగు అంశాలు ఎంతో ముఖ్యం. ఇందులో భూమి, విత్తనం, కష్టపడే తత్వం రైతు దగ్గర ఉన్నాయి. సాగునీరు, విద్యుత్తు ప్రభుత్వం సరైన సమయంలో అందిస్తే రైతు కడుపునిండా పంట పండించగలడు. అప్పుడు రైతు అప్పులు ఎందుకు చేయాల్సి వస్తుంది?
మన బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం లక్షా 48 వేల ఎకరాల సాగుభూమి ఉంది. ఇందులో సుమారు 98 వేల ఎకరాలు నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉండగా, మిగిలిన భూములకు బోర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందుతుంది
సుమారు 10 వేల ఎకరాలకు జాకోర, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, మిగిలిన భూమికి సిద్ధాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నాం.
రాష్ట్రంలోని కోటి 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు చెరువులు, చెక్‌డ్యామ్‌లు, విద్యుత్తు వంటి సౌకర్యాలను ప్రభుత్వం సమకూర్చాలి. రైతుకు ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం మిగిలేలా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తే, రాష్ట్ర రైతుల చేతుల్లోనే సుమారు రూ.1.50 లక్షల కోట్ల సంపద సమకూరుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంతటి బలాన్నిస్తుందో ఆలోచించాలి.
మన నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో నస్రుల్లాబాద్ మండలంలో హాజీపూర్ చెరువును తవ్వించడంతో హాజీపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనే కాకుండా పక్క మండలాల వరకు భూగర్భ జలాలు పెరిగాయి. అదేవిధంగా మైలారం గ్రామంలో నిజాంసాగర్ కాలువ నీరు అందని సుమారు 600 ఎకరాలకు పెరుకులేషన్ ట్యాంకుల నిర్మాణం వల్ల భూముల్లో భూగర్భ జలాలు పెరిగి, బోర్ల కింద రెండు పంటలు సాగు చేసుకుంటున్నారు.
ఒక చెరువు, ఒక చెక్‌డ్యామ్ కేవలం నీటిని నిల్వ చేసే నిర్మాణం మాత్రమే కాదు.. దాని చుట్టుపక్కల వందలాది రైతు కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపే అభివృద్ధి సాధనం.
రైతు సంతోషంగా ఉంటేనే గ్రామం సుభిక్షంగా ఉంటుంది. రైతు అప్పుల ఊబి నుంచి బయటపడి ఆత్మగౌరవంతో, సొంత పెట్టుబడితో వ్యవసాయం చేసే రోజులు రావాలి. అందుకోసం సాగునీటి వనరుల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తాను అని పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular