అభివృద్ధికి నిధులు మంజూరు
నిజామాబాద్, నవంబర్ 25 :ద్రోణ
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సాలూర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులను పరిశీలించారు. ఎఫ్.ఆర్.ఎస్ విధానంలో విద్యార్థులు,ఉపాధ్యాయుల హాజరు ప్రక్రియను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. మౌలిక వసతులు, అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా విద్యార్థులకు పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేవని హెచ్.ఎం రాజీ మంజుశ్రీ కలెక్టర్ దృష్టికి తేగా, ఐదు అదనపు తరగతి గదులను మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పాఠశాలకు ప్రహరీ గోడ, ప్లే గ్రౌండ్ ను కూడా మంజూరు చేస్తామని వెల్లడించారు. అయితే వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య మరింత గణనీయంగా పెరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ, బోధనా విధులకు హాజరు కావాలని అన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజర్ అయిన వారిని షోకాజ్ నోటీసులు అందించడం వంటివి కాకుండా నేరుగా సస్పెన్షన్ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అదేవిధంగా విద్యార్థులు సైతం నూటికి నూరు శాతం క్రమం తప్పకుండా బడికి హాజరయ్యేలా చూడాలన్నారు. ఎక్కువ రోజుల పాటు గైర్హాజర్ అయ్యే విద్యార్థిని విద్యార్థులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, వారు ఎందుకు బడికి రావడం లేదన్నది క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రతి విద్యార్థికి సంబంధించి తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలన్నారు. ఉన్నత పాఠశాలకు ఆనుకుని ఉన్న ఉర్దూ మీడియం స్కూల్ ను సైతం కలుపుకుని విద్యార్థులకు అనువైన రీతిలో ప్లే గ్రౌండ్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ 8వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో భేటీ అయ్యారు. గణితం సబ్జెక్టుపై ప్రశ్నలు వేసి, విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేశారు. చక్కగా సమాధానాలు చెప్పిన విద్యార్థులకు బహుమతులు, చాక్లెట్లు అందించారు. అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, చక్కగా చదువుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఇంచార్జి డీ.ఈ.ఓ సాయాగౌడ్, తహసీల్దార్ ఎం.ఏ.నవాజ్ తదితరులు ఉన్నారు.





