తిర్మన్ పల్లిలో సర్వేల నిర్వహణ పై గ్రామస్తుల అభ్యంతరాలు

క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి వివరాలు సేకరించకుండానే
నమోదు చేస్తున్నారంటూ ఆరోపణలు..
ఉన్నతాధి కారులు స్పందించాలని గ్రామస్తుల విజ్ఞప్తి
నిజామాబాద్ రూరల్, నవంబర్ 20 ద్రోణ:-
నిజామాబాద్ రూరల్ మండలంలోని తిర్మన్ పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేల తీరు పై గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సమగ్ర వివరాలు సేకరించి, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి సర్వే నిర్వహించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలోని ప్రతి కుటుంబానికి, సంబంధిత లబ్ధిదారులకు లేదా భూములకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోకుండానే సర్వే ప్రక్రియ కొనసాగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం చేపట్టే ఏ సర్వే అయినా ప్రజలకు న్యాయం జరిగేలా, ఎలాంటి పొర పాట్లకు తావులేకుండా పారదర్శకంగా జరగాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో భూములు, కుటుంబ వివరాలు, ప్రభుత్వ పథకాల అర్హతలకు సంబంధించిన సమాచారం అత్యంత కీలకమైనది. ఏలాంటి క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ చేయకుండా వివరాలు నమోదు చేస్తే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సర్వే ప్రక్రియలో సంబంధిత వ్యక్తులకు ముందస్తు సమాచారం అందించడం, వారి సమక్షంలోనే కొలతలు నిర్వహించడం, భూమి హద్దులు, సర్వే నంబర్లు, విస్తీర్ణం, రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడం వంటి అంశాలు ఎంతో ముఖ్యమైనవి. ఈ విషయాల పై జిల్లా కలెక్టర్ సైతం రీసర్వేలో పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని అధికారులకు సూచించినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి.
తప్పులు జరిగితే బాధ్యత ఎవరిది?

సర్వే సమయంలో సంబంధిత భూమి యజమానులకు సమాచారం ఇవ్వకుండా లేదా వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా వివరాలు నమోదు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఒకసారి తప్పుగా నమోదు చేసిన వివరాలు అధికారిక రికార్డులలో కి వెళితే వాటిని సరిచేసుకోవడానికి బాధితులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అందువల్ల సర్వే సిబ్బంది తొందర పాటుకు తావు లేకుండా, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాల్సిన అవసరం ఉంది.
జిల్లా అధికారులు స్పందించాలి
తిర్మన్ పల్లి గ్రామంలో జరుగుతున్న సర్వే తీరు పై జిల్లా కలెక్టర్, సంబంధిత రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో స్వతంత్రంగా క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టి, సర్వే వివరాలలో ఏవైనా తప్పులు ఉన్నాయా అనే అంశాన్ని విచారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే వివరాలు నమోదు చేసినట్లయితే వాటిని మరో సారి పరిశీలించి, బాధితులకు తమ అభ్యంతరాలు తెలియజేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

ప్రభుత్వం చేపడుతున్న సర్వేల ప్రధాన ఉద్దేశం ప్రజలకు న్యాయం చేయడం, రికార్డులలో పారదర్శకత తీసుకురావడమే. అలాంటప్పుడు సర్వే ప్రక్రియలో ఎలాంటి పక్షపాతానికి, నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తిర్మన్ పల్లి గ్రామంలో నెలకొన్న ఈ సమస్యపై ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తారా? గ్రామస్తుల అభ్యంతరాలను పరిష్కరించి పారదర్శకమైన సర్వేకు చర్యలు తీసుకుంటారా? లేదా దీనిపై సర్వేలు నిలిపివేయాలని అధికారులపై ఆధారపడి ఉంది. గత యిరువై రోజుల నుంచి సర్వే జరుగుతున్న ఒక్క అధికారి కూడా తొంగిచూసిన పాపాన పోలేదు. మొత్తం “జిపిఓ” లపై భారం వేసి సర్వేర్లు ప్రజలకు అర్థం కాని వ్యవధిలో ఇష్టారాజ్యం ఉన్నట్లు చేస్తున్నారు.