ఫొటో, డమ్మీ పత్రాలతో పోర్టల్‌లో దరఖాస్తు..

ఫీజు చెల్లించగానే సర్టిఫికెట్ జారీ
భోపాల్, సెప్టెంబర్ 30 ద్రోణ:- మధ్యప్రదేశ్‌లో నర్సింగ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపేలా ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. నర్సింగ్ శిక్షణ పొందిన వారికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేసే ప్రక్రియలో అధికారులు వివరాలను ఎంతవరకు పరిశీలిస్తున్నారో తెలుసుకునేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నంలో.. గాడిద ఫొటో, డమ్మీ పత్రాలతో దరఖాస్తు చేసినా సర్టిఫికెట్ జారీ అయినట్లు సమాచారం.
నర్సింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసేటప్పుడు గాడిద ఫొటోతో పాటు నకిలీ/డమ్మీ పత్రాలను అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. నిర్ణీత ఫీజును చెల్లించిన అనంతరం దరఖాస్తు ప్రక్రియ పూర్తవడంతో సర్టిఫికెట్ జారీ అయినట్లు వెల్లడైంది. ఈ ఘటన నర్సింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పత్రాల పరిశీలన, ధ్రువీకరణ ఎంతవరకు జరుగుతోందనే ప్రశ్నలను లేవనెత్తింది.

ఈ వ్యవహారం బయటకు రావడంతో నర్సింగ్ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్హతలు, విద్యార్హతలు, శిక్షణ వివరాలు, గుర్తింపు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉండగా.. కనీస పరిశీలన లేకుండానే సర్టిఫికెట్ ఎలా జారీ అయిందనే అంశంపై చర్చ జరుగుతోంది. అధికారులు దీనిపై విచారణ చేపట్టి, పోర్టల్‌లోని లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు
