Friday, October 2, 2026

రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు

నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా సహకరిస్తామంటూ డిమాండ్‌….

టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, సీనియర్‌ అసిస్టెంట్‌పై కేసు

మొయినాబాద్‌ అక్టోబర్ 01 ద్రోణ:- అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో మొయినాబాద్‌ మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు అధికారులు చిక్కారు. నిర్మాణానికి సంబంధించి ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా అధికారికంగా సహకరిస్తామంటూ రూ.75 వేల లంచం డిమాండ్‌ చేసి, ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, సీనియర్‌ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. మొయినాబాద్‌ మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి గుండు వాణి (ఏఓ-1), ఫిర్యాదుదారుడి నిర్మాణాన్ని చట్టవిరుద్ధమైనదిగా పరిగణించి, దానిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా అధికారిక సహాయం చేస్తానని తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మొయినాబాద్‌ గ్రామ పంచాయతీ మాజీ కార్యదర్శి, ప్రస్తుతం మొయినాబాద్‌ మున్సిపాలిటీలో డిప్యూటేషన్‌పై సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యలమోని సుదర్శన్‌ (ఏఓ-2) ద్వారా ఫిర్యాదుదారుడిని రూ.75 వేల లంచం కోసం డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.

సెప్టెంబర్‌ 30న లంచం సొమ్మును స్వీకరిస్తున్న సమయంలో సిటీ రేంజ్‌-2 ఏసీబీ అధికారులు ట్రాప్‌ నిర్వహించారు. ఏ ఓ-2 సూచన మేరకు అతని వద్ద నుంచి రూ.75 వేల లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులైన ఇద్దరు అధికారులు తమ విధులను సక్రమంగా, నిజాయితీగా నిర్వహించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు వ్యవహరించినట్లు ఏసీబీ పేర్కొంది.

ఇద్దరు నిందితులను జ్యుడిషియల్‌ రిమాండ్‌ నిమిత్తం నాంపల్లిలోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి పేరు, ఇతర వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ స్పష్టం చేసింది.

ప్రభుత్వ అధికారి ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్‌ 9440446106 ద్వారా కూడా ఏసీబీని సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular