భారతీయులకు కేంద్రం హెచ్చరిక
తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రాణాలను పణంగా పెట్టొద్దు

ప్రమాదాలపై రెండేళ్లుగా అప్రమత్తం చేస్తున్న విదేశాంగశాఖ
న్యూఢిల్లీ అక్టోబర్ 01 ద్రోణ:- రష్యా సైన్యంలో భారతీయులు స్వచ్ఛందంగా చేరుతున్న ఘటనలు తమ దృష్టికి వచ్చినట్లు కేంద్ర విదేశాంగశాఖ వెల్లడించింది. రష్యా సైన్యంలో చేరడం తీవ్ర ప్రమాదాలతో కూడుకున్నదని హెచ్చరిస్తూ.. ఇలాంటి నిర్ణయాలకు దూరంగా ఉండాలని భారతీయులకు సూచించింది. తాత్కాలిక ప్రయోజనాలు, ఆర్థిక లాభాల కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.
రష్యా సైన్యంలో చేరేందుకు కొందరు భారతీయులు తమ పౌరసత్వాన్ని సైతం వదులుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు విదేశాంగశాఖ పేర్కొంది. ఈ పరిణామాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. రష్యా సైన్యంలో చేరడం వల్ల ఎదురయ్యే భద్రతాపరమైన, చట్టపరమైన సమస్యలపై భారతీయులను గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం పలుమార్లు హెచ్చరిస్తూనే ఉందని వెల్లడించింది.
ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకునే అవకాశం
రష్యా సైన్యంలో చేరిన భారతీయులు అక్కడి సైనిక కార్యకలాపాల్లో భాగస్వాములు కావాల్సిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. యుద్ధ పరిస్థితుల్లో ప్రాణాలకు ముప్పుతో పాటు అనేక ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున.. విదేశాల్లో ఉద్యోగం లేదా ఇతర ప్రయోజనాల పేరుతో వచ్చే ఇలాంటి అవకాశాలను అంగీకరించే ముందు పూర్తిస్థాయిలో ఆలోచించాలని సూచించింది. భారతీయులు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను పరిశీలించే సమయంలో సంబంధిత దేశాల నిబంధనలు, ఒప్పందాల వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని విదేశాంగశాఖ సూచించింది. ముఖ్యంగా రష్యా సైన్యంలో చేరే ప్రతిపాదనలను పూర్తిగా తిరస్కరించాలని కేంద్రం స్పష్టం చేసింది.
