7 రోజులకు మించి సంతకం
చేయకపోతే కలెక్టర్ విచారణ….

ఉద్దేశపూర్వక జాప్యమైతే చర్యలు
హైదరాబాద్ అక్టోబర్ 01 ద్రోణ:- గ్రామపంచాయతీల్లో చెక్కుల జారీ, బిల్లుల చెల్లింపుల విషయంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌ల మధ్య తలెత్తుతున్న వివాదాలకు ప్రభుత్వం చెక్ పెట్టే దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది. చెక్కులపై సంతకం చేయాల్సిన ఉపసర్పంచ్ కారణం లేకుండా ఏడు రోజులకు మించి జాప్యం చేస్తే కలెక్టర్ విచారణ చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విచారణలో ఉపసర్పంచ్ ఉద్దేశపూర్వకంగానే చెక్కులపై సంతకం చేయకుండా జాప్యం చేసినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గ్రామపంచాయతీల అభివృద్ధి పనులు, ఇతర చెల్లింపులు సకాలంలో జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అదేవిధంగా ఉపసర్పంచ్ సంతకం చేయకుండా చెక్కుల చెల్లింపులు నిలిచిపోయే పరిస్థితి తలెత్తకుండా, అవసరమైన సందర్భాల్లో ఉపసర్పంచ్ స్థానంలో పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ, ఎంపీడీఓలలో ఒకరికి జాయింట్ చెక్ పవర్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంతో గ్రామపంచాయతీల్లో చెక్కుల జారీ, బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో అనవసర జాప్యాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
