Friday, October 2, 2026

పాటలు.. నాటకాలతో ప్రజల్లో చైతన్యం

సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు భద్రత, మహిళల రక్షణపై అవగాహన

జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 106 కార్యక్రమాలు నిర్వహించిన నిజామాబాద్ పోలీస్ కళాబృందం

నిజామాబాద్/ అక్టోబర్ 01ద్రోణ:- ప్రజల్లో నేరాలపై అవగాహన కల్పిస్తూ, ముందస్తు జాగ్రత్తల ద్వారా నేరాల నివారణకు నిజామాబాద్ పోలీస్ కళాబృందం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని గ్రామాలు, పట్టణాల్లో పోలీస్ కళాబృందం పర్యటిస్తూ పాటలు, నాటకాలు, ప్రసంగాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తోంది. జనవరి నుంచి సెప్టెంబర్ 2026 వరకు మొత్తం 106 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.

సమాజంలో నేరాలు, మోసాలు చోటుచేసుకున్న తర్వాత చర్యలు తీసుకోవడంతో పాటు, అవి జరగకుండా ముందస్తుగానే ప్రజలను అప్రమత్తం చేయడమే కళాబృందం ప్రధాన లక్ష్యమని కమిషనర్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో పాటలు, నాటకాల రూపంలో సందేశాలను అందిస్తూ సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, మహిళల రక్షణ, మూఢనమ్మకాలు, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన

రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కళాబృందం ప్రజలకు సూచిస్తోంది. హెల్మెట్ ధరించకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం వంటి కారణాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వివరిస్తోంది. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తన బాధ్యతగా గుర్తించాలని సూచిస్తోంది.

మహిళల భద్రతపై అవగాహన

మహిళల రక్షణకు సంబంధించిన నూతన చట్టాలు, అందుబాటులో ఉన్న పోలీస్ సేవలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు ఏదైనా అసౌకర్యానికి గురైనప్పుడు షీ టీమ్ నంబర్ 87126-59795 లేదా అత్యవసర సేవల కోసం డయల్ 112కు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.

సైబర్ మోసాలపై అప్రమత్తం

ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కళాబృందం హెచ్చరిస్తోంది. సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని, మోసానికి గురైన వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచిస్తోంది. అలాగే పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ (CEIR) సి,ఈ,ఐ,ఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి రికవరీ చేసుకునే విధానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.

డ్రగ్స్‌కు దూరంగా యువత

మాదకద్రవ్యాల వినియోగం నేరమని, వాటి వినియోగానికి చట్టపరమైన శిక్షలు ఉంటాయని కళాబృందం వివరిస్తోంది. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే 1908 నంబర్‌కు సమాచారం అందించాలని సూచిస్తోంది. యువత చెడు మార్గాల్లోకి వెళ్లకుండా తల్లిదండ్రులు, విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరిస్తోంది.

కల్తీ కల్లు, చైన్ స్నాచింగ్‌పై హెచ్చరిక

‘కల్తీ కల్లు వద్దు.. జీవితం ముద్దు’ అనే సందేశంతో కల్తీ కల్లు వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చైన్ స్నాచింగ్‌లను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం అందించడం, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని కూడా వివరిస్తున్నారు.

ప్రజల నుంచి మంచి స్పందన

పోలీస్ కళాబృందం కార్యక్రమాలకు గ్రామాలు, పట్టణాల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. సామాజిక అంశాలు, చట్టాలు, ప్రజల హక్కులు, నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నూతన పద్ధతులను అనుసరిస్తున్నామని చెప్పారు. కళాబృందం పర్యటనల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో చైతన్యం పెరుగుతోందని, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా విస్తృతంగా వివరిస్తున్నామని తెలిపారు. ప్రజలను చైతన్యపరచడం, నేరాల నివారణకు సహకరించేలా చేయడం తమ ప్రధాన లక్ష్యమని కమిషనర్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular