Friday, October 2, 2026

చక్కెర నిల్వలపై కేంద్రం కీలక ఆంక్షలు

అక్టోబర్ 15 నుంచి కొత్త నిబంధనలు..

కృత్రిమ కొరత, బ్లాక్‌ మార్కెటింగ్‌కు చెక్

హైదరాబాద్ అక్టోబర్ 02 ద్రోణ:- దేశంలో చక్కెర ధరలు పెరగకుండా, కృత్రిమ కొరత, బ్లాక్‌ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని చక్కెర వ్యాపారుల స్టాక్‌ హోల్డింగ్‌ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ నిబంధనలు 2026 అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 30 వరకు అమల్లో ఉంటాయి. డీలర్లకు 1,000 క్వింటాళ్ల పరిమితి కొత్త నిబంధనల ప్రకారం సాధారణ ప్రాంతాల్లో చక్కెర డీలర్లు ఒకేసారి గరిష్ఠంగా 1,000 క్వింటాళ్ల వరకు మాత్రమే నిల్వ ఉంచుకోవాలి. డీలర్‌ వద్దకు చక్కెర చేరిన తేదీ నుంచి 15 రోజుల్లోపు మార్కెట్‌లోకి విడుదల చేయాలి. 15 రోజులకు మించి నిల్వ ఉంచేందుకు అనుమతి ఉండదు. అయితే ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కోల్‌కతా, పరిసర మెట్రోపాలిటన్ ప్రాంతాలు, అస్సాం ప్రాంతాల్లో డీలర్లకు గరిష్ఠంగా 2,000 క్వింటాళ్ల వరకు నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ధరల తగ్గుదల వినియోగదారులకు చేరాలి. ఇటీవల చక్కెర ధరలు కొంతమేర తగ్గినట్లు కేంద్రం తెలిపింది. ఆగస్టులో నమోదైన గరిష్ఠ స్థాయితో పోలిస్తే సగటు రిటైల్‌ ధర సుమారు 15 శాతం, ఎక్స్‌-మిల్‌ ధరలు దాదాపు 28 శాతం తగ్గినట్లు పేర్కొంది. గత మూడు వారాలుగా ఎక్స్‌-మిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయని వెల్లడించింది. ధరల తగ్గుదల ప్రయోజనం వినియోగదారులకు కూడా అందేలా టోకు, చిల్లర వ్యాపారులు చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. కొత్త సీజన్‌పై నిరంతర పర్యవేక్షణ
అక్టోబర్‌ 1 నుంచి కొత్త చక్కెర సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు, చెరకు దిగుబడులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. రైతులు, వినియోగదారులు, చక్కెర పరిశ్రమ ప్రయోజనాలను సమతుల్యం చేస్తూ మార్కెట్‌లో చక్కెర నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular