15 మంది అభ్యర్థులకే ఓటు వేయాలి..

ఒక్క ఓటు అదనంగా వేసినా చెల్లదు
నిజామాబాద్, అక్టోబర్ 3ద్రోణ:- ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలు ఈ నెల 4న జరగనున్న నేపథ్యంలో ఇందూర్ సేవా సమితి ప్యానల్ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్యానల్ అభ్యర్థులు రెడ్‌క్రాస్ సభ్యులను వ్యక్తిగతంగా కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
ఇందూర్ సేవా సమితి ప్యానల్ తరఫున సీరియల్ నంబర్ 8 డీ కొండ యాదగిరి, 14వ నంబర్ అభ్యర్థి కెంపుల నాగరాజు తదితరులు సభ్యులను కలిసి ప్రచారం నిర్వహించారు. తమ ప్యానల్ తరఫున పోటీ చేస్తున్న సీరియల్ నంబర్లు 4, 6, 8, 10, 12, 14, 15, 18, 19, 20, 23, 24, 25, 26, 29 అభ్యర్థులకు మద్దతుగా ఓటు వేసి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల పోలింగ్ 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి సభ్యుడు తప్పనిసరిగా పోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. బ్యాలెట్ లో పేర్కొన్న 15 మంది అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని, అంతకంటే ఒక ఓటు ఎక్కువగా వేసినా ఓటు చెల్లుబాటు కాదని అభ్యర్థులు సభ్యులకు సూచించారు. ఈ విషయాన్ని ప్రతి ఓటరు గమనించి నిబంధనలకు అనుగుణంగా ఓటు వేయాలని కోరారు. కొత్త బృందానికి సభ్యులందరూ మద్దతు ఇచ్చి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకరించాలని ఇందూర్ సేవా సమితి ప్యానల్ అభ్యర్థులు పిలుపునిచ్చారు.
