2017 నుంచి 2026 సెప్టెంబర్ వరకు 10,991 కెమెరాల ఏర్పాటు..
ప్రజల్లో చైతన్యం రావాలి
నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి:

పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
నిజామాబాద్, అక్టోబర్ 3ద్రోణ:-
నేర రహిత కమిషనరేట్‌గా నిజామాబాద్‌ను తీర్చిదిద్దేందుకు పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నారని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సంస్థలు, అపార్ట్‌మెంట్లు, విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 2017 నుంచి 2026 సెప్టెంబర్ వరకు కమ్యూనిటీ కాంటాక్ట్, నేను సైతం కార్యక్రమాల కింద మొత్తం 10,991 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో దొంగతనాలు, దాడులు, మోసాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడం, చోరీకి గురైన ఆస్తులను రికవరీ చేయడం పోలీసులకు సవాలుగా ఉండేదన్నారు. ప్రస్తుతం పట్టణాలు, గ్రామాల్లో జనాభా, వాణిజ్య సముదాయాలు, బంగారు దుకాణాలు, వస్త్ర దుకాణాలు, సినిమా థియేటర్లు, విద్యాసంస్థలు, కాలేజీలు, యూనివర్సిటీలు, అపార్ట్‌మెంట్లు తదితర ప్రాంతాలు విస్తరిస్తున్న నేపథ్యంలో భద్రతా చర్యలు కూడా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. నేరం జరిగిన తర్వాత నిందితుల కోసం వెతకడం కంటే నేరం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మేలని కమిషనర్ పేర్కొన్నారు. సీసీ కెమెరాలు నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, నేరం జరిగిన సందర్భంలో నిందితులను త్వరగా గుర్తించేందుకు, చోరీకి గురైన ఆస్తులను రికవరీ చేసేందుకు, కోర్టు విచారణలో ఆధారాలుగా ఉపయోగపడేందుకు దోహదం చేస్తాయని తెలిపారు. ప్రజలు తమ విలాసవంతమైన ఖర్చుల్లో కొంత మొత్తాన్ని తగ్గించి, తమ భద్రత కోసం ఇళ్లలో, ఇళ్ల బయట, వీధుల్లో అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలే యూనిఫాం లేని పోలీసులుగా వ్యవహరిస్తూ నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎక్కడెక్కడ కెమెరాలు అవసరం..
వ్యాపార, వాణిజ్య సంస్థల్లో షాపుల లోపల మాత్రమే కాకుండా బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ర్యాలీలు, కార్యక్రమాలు జరిగే ప్రధాన కూడళ్లలో కెమెరాలు ఉంటే ఆస్తి నష్టం, ఇతర అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు అవకాశం ఉంటుందన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, విద్యార్థులపై దాడులు, వాహనాల చోరీ లేదా ధ్వంసం వంటి ఘటనలను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని తెలిపారు. మహిళల భద్రతకు కూడా ఇవి దోహదం చేస్తాయన్నారు. బ్యాంకులు, ఏటీఎంలలో లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఖాతాదారుల భద్రతను మెరుగుపరచవచ్చన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు వంటి ప్రార్థనా మందిరాల్లోనూ తప్పనిసరిగా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సినిమా థియేటర్లలో బాల్కనీ, ప్రవేశ ద్వారాలు, గేట్లు, పార్కింగ్ ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేయాలని, అపార్ట్‌మెంట్లు, ఆసుపత్రుల్లో భవనం లోపలితో పాటు వాహనాల పార్కింగ్ ప్రదేశాలను కూడా కెమెరాల పరిధిలోకి తీసుకురావాలని తెలిపారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుతో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వాస్తవాలను గుర్తించడం, ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం, వాహనాల రాకపోకలను నియంత్రించడం సాధ్యమవుతుందన్నారు. క్రీడా మైదానాలు, వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లోనూ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా చిన్నచిన్న వివాదాలు, చోరీలు, ఇతర నేరాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ నేర పరిశోధనలోనే కాకుండా కోర్టు విచారణలోనూ కీలక ఆధారంగా ఉపయోగపడుతుందని కమిషనర్ తెలిపారు. మతపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యే ఘటనలు, ఇతరుల కులాలు, మతాలను కించపరిచే చర్యలు, మహిళలపై అసభ్య ప్రవర్తన వంటి ఘటనలను గుర్తించడంలోనూ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు.

“మన సమాజం, మన పట్టణం, మన గ్రామం, మన వీధి బాగుంటే మనం బాగుంటాం. సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలి” అని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పిలుపునిచ్చారు.
