విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగకరం..

పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలి
కోటగిరి, అక్టోబర్ 05ద్రోణ:-
గ్రామీణ ప్రాంత విద్యార్థులు, యువత ఉన్నత విద్యావంతులుగా ఎదగడానికి పుస్తక పఠనం ఎంతో దోహదపడుతుందని కోటగిరి ఎంపీడీవో విష్ణు, ఎత్తోండ గ్రామ సర్పంచ్ శ్వేతా సూర్యకాంత్ అన్నారు. సోమవారం కోటగిరి మండలం ఎత్తోండ గ్రామ పంచాయతీ ప్రాంగణంలో హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్వేతా సూర్యకాంత్ మాట్లాడుతూ గ్రామంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతకు విజ్ఞానాన్ని పెంపొందించేందుకు గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉచితంగా పుస్తకాలను అందించిన హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీడీవో విష్ణు మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. పాఠ్యపుస్తకాలతో పాటు సాధారణ జ్ఞానం, సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. గ్రంథాలయంలోని పుస్తకాలను విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
