Tuesday, October 6, 2026

రైతుకు భరోసా కల్పించాలి

వరి ధాన్యానికి రూ.4,500–5,000 మద్దతు ధర ప్రకటించాలి:

పీఏసీఎస్ చైర్మన్ డా. వెనిగళ్ళ సునీల్ కుమార్ చౌదరి

కోటగిరి, అక్టోబర్ 05ద్రోణ:- రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కొత్తపల్లి పీఏసీఎస్ చైర్మన్ డాక్టర్ వెనిగళ్ళ సునీల్ కుమార్ చౌదరి కోరారు. కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 2026 వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం కొత్తపల్లి గ్రామంలోని పీఏసీఎస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రారంభించారు. చైర్మన్ డా. వెనిగళ్ళ సునీల్ కుమార్ చౌదరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా, ముఖ్య అతిథిగా కోటగిరి మండల తహసీల్దార్ కె. గంగాధర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్‌లో వరి ధాన్యానికి లభిస్తున్న ధరలను దృష్టిలో ఉంచుకుని దొడ్డు వడ్ల నుంచి సన్న వడ్ల వరకు క్వింటాల్‌కు కనీసం రూ.4,500 నుంచి రూ.5,000 వరకు అధికారిక మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ఈ మేరకు పీఏసీఎస్ జనరల్ బాడీ సమావేశంతో పాటు ఇతర సమావేశాల్లో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు.

తెలంగాణలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు కూడా ఇదే అంశంపై తీర్మానాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరను రూ.4,500–5,000గా ప్రకటిస్తే రైతులకు ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా భరోసా ఏర్పడటంతో పాటు ప్రైవేటు వ్యాపారులు కూడా అంతకంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్‌లో క్వింటాల్ వరి ధాన్యానికి సుమారు రూ.4,000 వరకు ధర లభిస్తోందని, రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ మద్దతు ధర రైతులకు కనీస ధరకు భరోసా కల్పిస్తుందని అన్నారు. “రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుంది.. వ్యవసాయం బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రైతుకు సరైన ధర లభించడమే రైతు కుటుంబానికి నిజమైన భరోసా” అని చైర్మన్ పేర్కొన్నారు.

రైతులు ధాన్యం నాణ్యత, తేమ శాతం, మార్కెట్ ధరలను పరిశీలించి తమకు అందుబాటులో ఉన్న మంచి ధరకు విక్రయించుకోవాలని సూచించారు. రైతుల అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక భద్రతే కొత్తపల్లి పీఏసీఎస్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో సర్పంచులు పి. గంగాధర్, కోర్ర రవి, వెల్లంకి సీతాకుమారి రంగదాస్ చౌదరి, శ్యామ్ కీ శంకర్, డైరెక్టర్లు వల్లేపల్లి శ్రీనివాసరావు, గుగులోతు తుకారాం, మండల వ్యవసాయ అధికారి రాజు, ఏఈఓలు రాంపూర్ షేక్ గౌస్, కొత్తపల్లి ప్రశాంత్, సీఈఓ కమలేష్, సుదర్శన్, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular