రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు..

అర్హులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 05ద్రోణ:- 22-ఏ నిషేధిత భూములకు సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులపై సత్వరమే స్పందించి అర్హులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దరఖాస్తుదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా, భూభారతి చట్టం మార్గదర్శకాలను అనుసరిస్తూ రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు.

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రెవెన్యూ అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లతో సుదర్శన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 22-ఏ నిషేధిత భూములు, భూభారతి, సాదాబైనామా తదితర పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. అన్ని దరఖాస్తులను వారం నుంచి పది రోజుల్లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన గడువు విధించారు. దరఖాస్తుల ధ్రువీకరణలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఏ దశలోనూ దరఖాస్తుదారులు ఇబ్బందులు పడకుండా అధికారులు చొరవ చూపాలని అన్నారు.
శిఖం భూముల పరిరక్షణకు చర్యలు
చెరువుల శిఖం భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట పకడ్బందీగా సర్వే నిర్వహించి హద్దులను నిర్ధారించాలని, ప్రభుత్వ భూములు, శిఖం భూములను పరిరక్షించాలని సూచించారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న భూ వివాదాల పరిష్కారానికి త్వరలో జాయింట్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఇసుక రవాణా నిబంధనలకు అనుగుణంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు సూచించారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఇసుక రవాణా వాహనాలు తిరగకుండా చూడాలని, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ధాన్యం రవాణాకు వాహనాల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.
పారిశుధ్య కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో పారిశుధ్య కార్మికులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిజామాబాద్, బోధన్ పట్టణాల్లో పారిశుధ్య కార్మికులకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయించినట్లు వెల్లడించారు.

సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, డీఆర్వో గీత, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయకుమారి, అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
