Tuesday, October 6, 2026

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తు

నాణ్యమైన విద్యతో భావిభారత పౌరులను తీర్చిదిద్దాలి:

ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి


ఉపాధ్యాయ దినోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

నిజామాబాద్, అక్టోబర్ 05ద్రోణ:- విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సమాజ ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని మరింత పెంచాలని సూచించారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.

ప్రభుత్వ బడులపై నమ్మకం పెంచాలి

ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మెరుగైన బోధనా సామర్థ్యం, నైపుణ్యాలను కలిగి ఉన్నారని అన్నారు. వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకుని పేద కుటుంబాల పిల్లలకు సైతం నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులను విస్తరిస్తోందన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, తెలంగాణ మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, ఏకరూప దుస్తులు, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణానికి రూ.21 కోట్ల నిధులు వెచ్చించినట్లు వెల్లడించారు.

ప్రభుత్వ బడులపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, విద్యా రంగంలో నిజామాబాద్ జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అంకితభావంతో పనిచేయాలని కోరారు.

తరగతి గదిలోనే భావిభారత పౌరుల నిర్మాణం

రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. ఉపాధ్యాయ నియామకాలు, బదిలీలు, పదోన్నతులు, మౌలిక వసతుల కల్పన, కొత్త డైట్ మెనూ, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు వంటి చర్యలతో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పులు వస్తున్నాయని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం పట్ల తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరుగుతున్నదానికి నిదర్శనమన్నారు. అయితే విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, ధ్యానం, యోగా, పెద్దలను గౌరవించడం వంటి అంశాలను కూడా విద్యార్థులకు నేర్పించాలని సూచించారు.

ఆధునిక పద్ధతుల్లో బోధన చేయాలి

కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా ఆధునిక బోధనా పద్ధతులను అవలంబించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎఫ్‌ఎల్‌ఎన్ విధానంపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అంకిత భావంతో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులకు తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని, విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. హక్కులను కోరుకోవడం ఎంత ముఖ్యమో, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం కూడా అంతే ముఖ్యమన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. విద్యాబుద్ధులు, వినయ విధేయతలు నేర్పించి జీవితంలో నిలదొక్కుకునేలా చేసేది ఉపాధ్యాయులేనని కలెక్టర్ పేర్కొన్నారు. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త బోధనా విధానాలను అవలంబిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులు బాటలు వేయాలని సూచించారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర గీత కార్మిక పారిశ్రామిక సంఘం చైర్మన్ శేఖర్ గౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, డీఐఈఓ రవికుమార్, డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించిన బాలికలకు జ్ఞాపికలు అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular