విధుల్లో అలసత్వం.. అనుమతులు లేకుండా పాఠశాల సామగ్రి విక్రయం
ప్రాథమిక విచారణలో ఆరోపణలు
నిర్ధారణ కావడంతో చర్యలు..

కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు
నిజామాబాద్ అర్బన్ అక్టోబర్ 07 ద్రోణ:- ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు (గెజిటెడ్ హెచ్‌ఎం) ఎ.శశికళను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో పాటు, సంబంధిత అధికారుల అనుమతి లేకుండా పాఠశాల సామగ్రిని విక్రయించినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ నిర్వహించిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు.
ప్రాథమిక విచారణలో పాఠశాల విధులకు హాజరుకాకుండానే హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేసినట్లు, పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ)తో పాటు సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పాఠశాలలోని జనరేటర్, ఫర్నిచర్‌ను విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను కూడా విక్రయించినట్లు విచారణలో వెల్లడైనట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల సామగ్రి విక్రయానికి సంబంధించి వచ్చిన అంశాలను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ హెచ్‌ఎం శశికళను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ నిర్వహించి, విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
