Thursday, October 8, 2026

సీఈసీ రాజీనామా చేయాల్సిందే!

జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా

నిజామాబాద్‌లో కాంగ్రెస్,

ఇండియా కూటమి ధర్నా

నిజామాబాద్ అక్టోబర్ 07 ద్రోణ:- కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు ఇండియా కూటమి ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ ధర్నాచౌక్‌లో ఆందోళన నిర్వహించారు. అనంతరం జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌తో పాటు వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఓట్లు తొలగించారని, తెలంగాణలో దాదాపు 90 లక్షలకు పైగా, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో సుమారు 80 వేలకుపైగా ఓట్లు తొలగించారని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే విధంగా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడం బాధాకరమన్నారు. దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా, తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ‘ఎస్‌ఐఆర్’ కార్యక్రమం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని నగేష్ రెడ్డి ఆరోపించారు. పీసీసీ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లాలోని మండల కేంద్రాల్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నాలు, దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆందోళన అనంతరం రానున్న రోజుల్లో గ్రామస్థాయికి కూడా ఉద్యమాన్ని విస్తరిస్తామని స్పష్టం చేశారు. సీఈసీ కమిషనర్ రాజీనామా చేసే వరకు ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, ఆర్ఎస్‌పీ జిల్లా కార్యదర్శి రాములు, నగర మేయర్ ఉమారాణి, కల్లుగీత కార్మిక చైర్మన్ శేఖర్ గౌడ్, నూడా చైర్మన్ కేశ వేణు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు. మహిళా నాయకులు, జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మైనారిటీ నాయకులు, నగర కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular