ఆరు నెలల పసిబిడ్డకు తల్లి పాలు
పట్టనీయలేదని ఆరోపణ…

అర్ధరాత్రి ఇంటికి వెళ్లిన సీసీఎస్ పోలీసులు
హైదరాబాద్ అక్టోబర్ 07 ద్రోణ:- తెలంగాణలో జర్నలిస్టులపై ప్రభుత్వం, పోలీసుల వేధింపులు పెరుగుతున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మహిళా జర్నలిస్టు రేఖను విచారణ పేరుతో సీసీఎస్ పోలీసులు గంటల తరబడి నిర్బంధించారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. మన్నె క్రిశాంక్‌కు సంబంధించిన ఎఫ్ ఐ ఆర్ లో తన పేరు ఉందంటూ సీసీఎస్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో జర్నలిస్టు రేఖ ఇంటికి వెళ్లినట్లు సమాచారం. మహిళా పోలీసులు లేకుండానే అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్లి ఆమెను విచారణకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం సీ సీ ఎస్ పోలీస్ స్టేషన్‌లో విచారణ పేరుతో రేఖ ను సుమారు ఏడు గంటలుగా ఉంచినట్లు కుటుంబ సభ్యులు, సహచరులు ఆరోపిస్తున్నారు. ఆమెకు ఆరు నెలల పసిబిడ్డ ఉండగా, తల్లి పాలు పట్టేందుకు కూడా పోలీసులు అనుమతించలేదని వారు పేర్కొంటున్నారు. ఆరు నెలల పసిబిడ్డతో పాటు మూడేళ్ల కొడుకును వెంట తీసుకుని వచ్చిన రేఖ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లోనే గంటల తరబడి పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొందని సమాచారం. చిన్నారుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అయినా పోలీసులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జర్నలిస్టు వర్గాలు కోరుతున్నాయి.
మహిళా జర్నలిస్టును అర్ధరాత్రి సమయంలో మహిళా పోలీసుల సమక్షం లేకుండా విచారణకు తీసుకెళ్లడం, చిన్నారికి తల్లి పాలు పట్టేందుకు అనుమతించకపోవడం వంటి ఆరోపణలపై పోలీసు ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విచారణ పేరుతో జర్నలిస్టుల హక్కులకు భంగం కలగకుండా చట్టపరమైన నిబంధనలను పాటించాలని కోరుతున్నారు.
