కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో అమరవీరుల కాలనీ..

జూన్ 2లోగా నిర్మాణం పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 7ద్రోణ:- సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలోని భూముల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 325లో రికార్డుల ప్రకారం 388 ఎకరాల భూమి ఉండగా, ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సర్వేలో 343 ఎకరాలు మాత్రమే గుర్తించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. దీంతో మిగిలిన 45 ఎకరాల భూమి ఆచూకీని తేల్చాలని సీఎం ఆదేశించారు.
ఈ భూముల సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించేందుకు ఎర్రవల్లి, వెంకటాపురం పరిధిలో ప్రత్యేక సర్వే నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే నంబర్ 325కు ఆనుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల భూములు ఉన్న నేపథ్యంలో సంబంధిత రెవెన్యూ రికార్డులను సమర్పించాలని వారికి నోటీసులు ఇవ్వాలని అధికారులకు సూచించారు.
అమరుల కుటుంబాలకు ప్రత్యేక కాలనీ
సర్వే అనంతరం గుర్తించే ప్రభుత్వ భూమిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాల కోసం ‘తెలంగాణ అమరవీరుల కాలనీ’ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. అర్హులైన అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, మౌలిక వసతులు కల్పించడంతో పాటు కాలనీ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ బోర్డుకు అప్పగించాలని సూచించారు. మిగిలిన భూమిని అర్హులైన స్థానిక పేద రైతులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన 2027 జూన్ 2లోగా అమరవీరుల కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేసి అర్హులకు ఇళ్లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు గడువు విధించారు.
