Thursday, October 8, 2026

రైతు పంటకు కరెంట్ కష్టాలు రాకూడదు

వరి పొట్ట దశలో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా తప్పనిసరి…

విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నిజామాబాద్ అక్టోబర్ 07 ద్రోణ:- రైతుల పంటలకు విద్యుత్‌ అంతరాయాలతో నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉన్నందున నాణ్యమైన విద్యుత్‌ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అదే సమయంలో విలీన గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పబ్లిక్ హెల్త్ అధికారులకు స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులతో ఆయన వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖల పరిధిలోని సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు.

అధిక లోడ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

విద్యుత్ శాఖ ఎస్‌ఈ రాజేశ్వర్, డీఈఈలు, ఇతర అధికారులతో జరిగిన సమావేశంలో వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ఎమ్మెల్యే సమీక్షించారు. విద్యుత్ అంతరాయాలపై వెంటనే స్పందించేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధిక లోడ్ ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ప్రత్యేక డీటీఆర్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాల ఏర్పాటు, మరమ్మతు పనులను త్వరితగతిన చేపట్టాలని, క్షేత్రస్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని అన్నారు.

విలీన గ్రామాల్లో పనులకు వేగం

పబ్లిక్ హెల్త్ శాఖ ఈఈ తిరుపతికుమార్, డీఈఈ, ఏఈఈలతో నిర్వహించిన సమీక్షలో విలీన గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల్లో జాప్యానికి తావులేకుండా చూడాలని, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో పాటు పనుల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular