రూ.3,700–3,800 ఇస్తామంటున్న ఇతర రాష్ట్రాల వ్యాపారులు..
స్థానికంగా మాత్రం ధరల పతనం…..

క్వింటాకు రోజుకు రూ.100 వరకు తగ్గుతున్న ధరలు
దళారుల బెదిరింపులపై రైతుల ఆరోపణలు
నిజామాబాద్ అక్టోబర్ 08 ద్రోణ:- పంట పండించేందుకు పెట్టుబడి పెరుగుతున్నా.. రైతు పండించిన ధాన్యానికి మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదని పోతంగల్ మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు పెరిగిన ఎరువుల ధరలు, యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని వరి సాగు చేసిన రైతులకు, ఇప్పుడు పంట చేతికొచ్చిన తర్వాత ధాన్యం విక్రయ సమయంలోనూ కొత్త కష్టాలు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. వరి పంట సాగు నుంచి కోత వరకు భారీగా ఖర్చు చేసిన రైతులు.. హార్వెస్టింగ్ పూర్తయిన అనంతరం ధాన్యాన్ని అమ్మేందుకు మార్కెట్‌కు తీసుకువస్తే సరైన ధర దక్కడం లేదని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యాపారులు క్వింటాకు రూ.3,700 నుంచి రూ.3,800 వరకు ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, స్థానికంగా కొందరు వ్యాపారులు, దళారులు, బ్రోకర్లు కలిసి ధరలను తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
పోటీ వ్యాపారులను అడ్డుకుంటున్నారా?
ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు వచ్చే వ్యాపారులను స్థానిక దళారులు, వ్యాపారులు బెదిరించి వెనక్కి పంపుతున్నారనే ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. పోటీ వ్యాపారులు లేకుండా చేసి, స్థానికంగా కొందరు వ్యక్తులు సిండికేట్‌గా ఏర్పడి ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో పోటీ తగ్గిపోయి ధాన్యం ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయని తెలిపారు. ఒక్క రోజులోనే క్వింటాకు రూ.100 వరకు ధర తగ్గుతున్న పరిస్థితి నెలకొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు. తాము పండించిన పంటను నిల్వ చేసుకునే స్థోమత లేక, అప్పులు తీర్చాల్సిన పరిస్థితుల్లో తక్కువ ధరకే ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
పెట్టుబడి పెరిగింది.. ధర మాత్రం తగ్గుతోంది
వరి సాగులో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు, సాగునీటి వ్యయం, హార్వెస్టింగ్ ఖర్చులు భారీగా పెరిగాయని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎరువుల ధరలు పెరగడం, అవసరమైన సమయంలో యూరియా అందుబాటులో లేకపోవడం తమపై అదనపు ఆర్థిక భారాన్ని మోపిందని పేర్కొన్నారు.
ఇన్ని కష్టాలను అధిగమించి పంటను పండించిన తర్వాత మార్కెట్‌లో ధాన్యానికి సరైన ధర లభించకపోతే రైతు పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పంట పండించే సమయంలో రైతు భరించిన కష్టానికి, పెట్టుబడికి, శ్రమకు తగ్గ ధర లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు.
దళారులపై చర్యలు తీసుకోవాలి
స్థానికంగా కొందరు దళారులు, బ్రోకర్లు, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు వెంటనే దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు స్వేచ్ఛగా ధాన్యం కొనుగోలు చేసే అవకాశం కల్పించాలని, పోటీ వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం ధరలను కృత్రిమంగా తగ్గించే ప్రయత్నాలను అరికట్టి, రైతులకు మార్కెట్‌లో సరైన ధర లభించేలా అధికారులు పర్యవేక్షణ పెంచాలని కోరుతున్నారు. రైతులను బెదిరించడం, వ్యాపారులను అడ్డుకోవడం వంటి ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్యే స్పందనపై రైతుల ఆశలు
ధాన్యం ధరల విషయంలో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పందించడం తమకు ఆశ కలిగించిందని రైతులు తెలిపారు. రైతుల సమస్యను అధికారులు, ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల జోక్యాన్ని అరికట్టి.. రైతుకు స్వేచ్ఛగా తన పంటను మంచి ధరకు అమ్ముకునే అవకాశం కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. తాము పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభిస్తేనే సాగు ఖర్చులు, అప్పుల భారాన్ని కొంతైనా అధిగమించగలమని పేర్కొన్నారు.
