స్టార్‌లింక్ లైసెన్స్ జాప్యం పై

ఎలాన్ మస్క్ సంచలన ప్రశ్నలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 8ద్రోణ: స్టార్‌లింక్ భారత్‌లో వాణిజ్య సేవలు ప్రారంభించడంలో జరుగుతున్న జాప్యం పై టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో సారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పేరును నేరుగా ప్రస్తావిస్తూ.. “భారత్‌లో అసలైన బాస్ అంబానీనా?” అంటూ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. స్టార్ లింక్ 165కు పైగా దేశాల్లో లైసెన్స్ పొంది సేవలు అందిస్తోందని, భారత్‌లో మాత్రం ఐదేళ్లుగా ప్రభుత్వ నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నప్పటికీ వాణిజ్య సేవలకు ఇంకా పూర్తి అనుమతి ఎందుకు లభించలేదని మస్క్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు భారత టెలికాం రంగంలో చర్చకు దారితీశాయి. అంతకు ముందు కూడా భారత్‌లోని కొంత మంది ప్రభావ శీల వ్యాపార వేత్తలు స్టార్ లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని మస్క్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు సంబంధించిన నియంత్రణ వ్యవస్థ నిష్పక్ష పాతంగా, వివక్ష లేకుండా అమలవుతోందని కేంద్ర టెలికాం శాఖ స్పష్టం చేసింది.
ప్రస్తుతం స్టార్‌లింక్‌తో పాటు రిలయన్స్ జియోకు చెందిన జియో సాట్‌కామ్, భారతీ గ్రూప్ మద్దతున్న యూటెల్‌సాట్ వన్‌వెబ్ సంస్థలు కూడా అవసరమైన అనుమతుల ప్రక్రియలో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. భద్రతా పరిశీలనలు పూర్తయిన తర్వాతే స్పెక్ట్రమ్ కేటాయింపు, వాణిజ్య సేవల ప్రారంభానికి సంబంధించిన తదుపరి దశలు కొనసాగుతాయని పేర్కొంది.
ఈ నేపథ్యంలో మస్క్ చేసిన “అంబానీనే భారత్‌కు అసలైన బాస్‌నా?” అన్న వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ, వ్యాపార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే స్టార్‌లింక్ లైసెన్స్ జాప్యానికి వ్యాపార ప్రయోజనాలే కారణమన్న మస్క్ వాదనను కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు.
