డిసెంబరులో గరిష్ఠ తీవ్రతకు చేరే అవకాశం..

ఫిబ్రవరి 2027 వరకు కొనసాగే సూచనలు
పసిఫిక్ సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం
కంటే 3.7 డిగ్రీలు పెరిగే అవకాశం..
భారత్‌లో పొడి వాతావరణానికి సంకేతాలు
హైదరాబాద్, అక్టోబర్ 08 ద్రోణ:- ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే ఎల్‌నినో పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయి. భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజా అంచనాలో వెల్లడించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఎల్‌నినో మరింత తీవ్రరూపం దాల్చి, డిసెంబర్‌లో గరిష్ఠ స్థాయికి చేరే అవకాశముందని పేర్కొంది. ఈ ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం దాదాపు 100 శాతానికి దగ్గరగా ఉందని తెలిపింది.
3.7 డిగ్రీల వరకు పెరగనున్న ఉష్ణోగ్రత
ఎల్‌నినో తీవ్రతను అంచనా వేయడంలో కీలకమైన ‘నినో 3.4’ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే జూన్‌లో 1.6 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉండగా, ఆగస్టులో 2.5 డిగ్రీలకు చేరింది. అక్టోబర్–డిసెంబర్ కాలంలో ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసం సగటున 3.7 డిగ్రీల సెల్సియస్ వరకు చేరవచ్చని డబ్ల్యూఎంఓ అంచనా వేసింది. ఇది గతంలో నమోదైన అత్యధిక స్థాయి కంటే కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గతంలో 2015 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్య నినో 3.4 ప్రాంతంలో 2.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వ్యత్యాసం నమోదైంది. ఇప్పుడు అంచనా వేస్తున్న 3.7 డిగ్రీలు ఆ స్థాయిని మించే అవకాశం ఉంది. అయితే ఇది ఇప్పటికే నమోదైన ఉష్ణోగ్రత కాదు.. అక్టోబర్–డిసెంబర్ కాలానికి సంబంధించిన ముందస్తు అంచనా అన్న విషయాన్ని వాతావరణ సంస్థ స్పష్టం చేసింది.
డిసెంబరులో తీవ్రత పతాక స్థాయికి
ఎల్‌నినో ఇప్పటికే ఏర్పడి వేగంగా బలపడుతోందని డబ్ల్యూఎంఓ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే డిసెంబర్‌లో దీని తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరవచ్చని తెలిపింది. 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్‌నినో ఘటనల్లో ఒకటిగా ఇది నిలిచే అవకాశం ఉందని డబ్ల్యూఎంఓ అంచనా వేసింది.
ప్రపంచవ్యాప్తంగా వేడి ముప్పు
ఎల్‌నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని డబ్ల్యూఎంఓ తెలిపింది. అయితే ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతిరోజూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని దీని అర్థం కాదని స్పష్టం చేసింది. కానీ సీజన్ మొత్తంగా అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వేడి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది. ప్రపంచ సముద్రాలు ఇప్పటికే అత్యంత వేడిగా ఉన్న పరిస్థితుల్లో ఎల్‌నినో బలపడటం వల్ల వాతావరణ వ్యవస్థపై అదనపు ప్రభావం పడే అవకాశం ఉందని డబ్ల్యూఎంఓ పేర్కొంది. ఎల్‌నినో భూమికి కొత్తగా వేడిని సృష్టించదని, సముద్రం లోపల ఇప్పటికే నిల్వ ఉన్న వేడిని పైకి తీసుకురావడం ద్వారా ప్రపంచ ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తుందని వివరించింది.
భారత్‌కు పొడి వాతావరణ సూచనలు
ఎల్‌నినో ప్రభావం భారత్‌పైనా పడే అవకాశం ఉంది. అక్టోబర్–డిసెంబర్ కాలంలో భారత ఉపఖండంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితులకు సూచనలు ఉన్నాయని డబ్ల్యూఎంఓ తెలిపింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం, నీటి లభ్యతపై ఒత్తిడి, వ్యవసాయ రంగంపై ప్రభావం వంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు, వరదల ముప్పు పెరిగే అవకాశముందని డబ్ల్యూఎంఓ పేర్కొంది. దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లో పొడి పరిస్థితులకు సూచనలు ఉన్నట్లు తెలిపింది.
‘సూపర్ ఎల్‌నినో’గా పిలుస్తున్నా..
ప్రస్తుతం ఎల్‌నినో అసాధారణ స్థాయిలో బలపడుతున్న నేపథ్యంలో కొందరు వాతావరణ విశ్లేషకులు దీనిని “సూపర్ ఎల్‌నినో”, “సూపర్ డూపర్ ఎల్‌నినో”గా అభివర్ణిస్తున్నారు. అయితే ప్రపంచ వాతావరణ సంస్థ అధికారికంగా ఈ పదాలను ఉపయోగించదు. ఎల్‌నినో తీవ్రతను సాధారణంగా బలహీన, మోస్తరు, బలమైన, అత్యంత బలమైన స్థాయిలుగా అంచనా వేస్తుంది. ప్రస్తుత ఘటన అత్యంత బలమైన ఎల్‌నినోల్లో ఒకటిగా మారే అవకాశం ఉందని మాత్రం డబ్ల్యూఎంఓ స్పష్టం చేసింది.
ఫిబ్రవరి వరకు ప్రభావం
2027 ఫిబ్రవరి వరకు ఎల్‌నినో కొనసాగడానికి దాదాపు 100 శాతం అవకాశముందని డబ్ల్యూఎంఓ అంచనా వేసింది. 13 జాతీయ, అంతర్జాతీయ వాతావరణ కేంద్రాల అంచనాలను సమన్వయం చేసి ఈ అంచనాను రూపొందించినట్లు తెలిపింది. ఎల్‌నినో ప్రభావాలు వర్షపాతం, ఉష్ణోగ్రతలతో పాటు వ్యవసాయం, నీటి వనరులు, ఆరోగ్యం, పర్యావరణం, ఆర్థిక కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది.
రికార్డు స్థాయి వేడి.. మారనున్న వర్షపాత నమూనాలు
ఎల్‌నినో బలపడుతున్న నేపథ్యంలో రానున్న నెలల్లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మరింత అస్థిరంగా మారే అవకాశాలపై డబ్ల్యూఎంఓ అప్రమత్తం చేసింది. సముద్ర ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరడం, భూమిపై అధిక ఉష్ణోగ్రతల అవకాశాలు పెరగడం, కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం–మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల ముప్పు ఏర్పడటం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని పేర్కొంది.
