సౌదీకి మద్దతుగా 10–20 వేల మంది సైనికుల మోహరింపుపై చర్చలు..

ఇప్పటికే యెమెన్ యుద్ధంలో తీవ్రత
రివాద్,అక్టోబర్ 08 ద్రోణ :- మధ్యప్రాచ్యంలో యెమెన్ కేంద్రంగా కొనసాగుతున్న ఘర్షణ మరింత విస్తరించే సంకేతాలు కనిపిస్తున్నాయి. హౌతీ తిరుగుబాటుదారుల దాడులను ఎదుర్కొంటున్న సౌదీ అరేబియాకు మద్దతుగా సిరియా సైన్యాన్ని రంగంలోకి దించే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సుమారు 10 వేల నుంచి 20 వేల మంది సిరియా సైనికులను యెమెన్‌కు పంపే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అమెరికా అధికారిని, సిరియా రక్షణ శాఖకు చెందిన అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. అయితే సిరియా ప్రభుత్వం మాత్రం తాము యెమెన్ యుద్ధంలో చేరుతున్నామన్న వార్తలను ఖండించింది. సౌదీ మద్దతుతో యెమెన్ ప్రభుత్వ బలగాలు హౌతీలపై భూదాడులను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. హౌతీలు సౌదీపై క్షిపణులు, డ్రోన్లతో దాడులను తీవ్రతరం చేస్తున్నారు. ఈ క్రమంలో సౌదీ అరేబియా తన మిత్రదేశాల నుంచి సైనిక, రక్షణ సహకారాన్ని కోరుతున్నట్లు సమాచారం.
విమానాశ్రయాలపై హౌతీల దాడులు
హౌతీల దాడుల్లో సౌదీలోని రియాద్ కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అబ్హా విమానాశ్రయాలు లక్ష్యంగా మారాయి. సౌదీ పౌర విమానయాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రెండు దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, 36 మంది గాయపడ్డారు. అబ్హా విమానాశ్రయంలో ఇద్దరు, రియాద్‌లోని కింగ్ ఖాలిద్ విమానాశ్రయంలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
రియాద్ విమానాశ్రయంపై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు హౌతీలు ప్రకటించగా, సౌదీ నేతృత్వంలోని బలగాలు దానిని అడ్డుకున్నట్లు తెలిపాయి. దాడుల నేపథ్యంలో రియాద్ నుంచి వందలాది విమాన సర్వీసులు రద్దు లేదా అంతరాయానికి గురైనట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి.
టర్కీ, పాకిస్థాన్ మద్దతు
మరోవైపు సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీల మధ్య కుదిరిన మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. సౌదీపై దాడిని ఉమ్మడి రక్షణకు సంబంధించిన అంశంగా పరిగణించే ఈ ఒప్పందం నేపథ్యంలో పాకిస్థాన్, టర్కీల నుంచి సౌదీకి రక్షణ సహకారం అందించే అంశం ముందుకు వచ్చింది. అయితే టర్కీ బలగాల ప్రత్యక్ష మోహరింపుపై పార్లమెంటరీ ప్రక్రియ వంటి అంశాలు ఇంకా ఉన్నాయి.ఇప్పటికే హౌతీల దాడులు సౌదీ విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకోవడం, యెమెన్‌లో సౌదీ మద్దతు ఉన్న బలగాల ఎదురుదాడులు కొనసాగుతుండటంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి నెలకొంది.
