ఖైదీకి గోల్డ్ మెడల్!
రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న
ఎన్. సురేశ్‌కు అరుదైన గౌరవం..

ఇతర ఖైదీలకు స్ఫూర్తిదాయకం
రాజమండ్రి, అక్టోబర్ 09ద్రోణ:- జైలు జీవితం విద్యకు అడ్డంకి కాదని నిరూపిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఎన్. సురేశ్ అరుదైన ఘనత సాధించారు. జైలులో ఉంటూనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే కాకుండా, గోల్డ్ మెడల్‌ను సైతం కైవసం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏఓయూ) ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా సురేశ్ బంగారు పతకాన్ని అందుకున్నారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి విద్యలో ప్రతిభ చాటడం ద్వారా తన పట్టుదలను నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ వి. సన్యాసిరావు మాట్లాడుతూ, సురేశ్ సాధించిన విజయం ఇతర ఖైదీలకు సైతం ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. జైలు జీవితంలోనూ విద్యకు ప్రాధాన్యమిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చనే విషయాన్ని ఈ విజయం చాటిచెబుతోందని తెలిపారు. శిక్ష అనుభవిస్తున్నప్పటికీ విద్య ద్వారా తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చని సురేశ్ నిరూపించడం విశేషం. ఆయన సాధించిన ఈ ఘనత జైళ్లలో విద్య, వ్యక్తిత్వ వికాసానికి ఉన్న ప్రాధాన్యాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.
