Friday, October 9, 2026

పూలవనంగా లయోలా పాఠశాల….

బతుకమ్మ పాటలతో విద్యార్థినుల సందడి!

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టిన వేడుకలు..

సాంప్రదాయ దుస్తులలో అలరించిన చిన్నారులు

బోధన్, అక్టోబర్ 09 ( ద్రోణ):- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక బతుకమ్మ పండుగ వేళ బోధన్ పట్టణంలోని లయోలా హైస్కూల్ రంగు రంగుల పూల సోయగాలతో కళకళలాడింది. పాఠశాలలో నిర్వహించిన ముందస్తు బతుకమ్మ వేడుకలు విద్యార్థినుల ఆటపాటలతో సందడిగా సాగాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినుల కోలాహలం పాఠశాల ప్రాంగణానికి పండుగ కళను తీసుకొచ్చాయి.

వేడుకల్లో భాగంగా పాఠశాల ఆవరణలో అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, బంతి తదితర పూలతో విద్యార్థినులు అందంగా బతుకమ్మలను పేర్చారు. అనంతరం బతుకమ్మలను, గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పించారు. బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ జానపద గీతాలు ఆలపిస్తూ కోలాటాలు ఆడారు. ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ పండుగ సంబరాల్లో మునిగిపోయారు.

పూల పండుగలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాఠ్యాంశాలతోపాటు తెలంగాణ పండుగలు, ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక వారసత్వంపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్ మాట్లాడుతూ.. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. భావితరాలకు తెలంగాణ సంప్రదాయాల గొప్పతనాన్ని పరిచయం చేయాలనే లక్ష్యంతో పాఠశాలలో బతుకమ్మ వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు తమ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకొని వాటిని భవిష్యత్తు తరాలకు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బోధన్ ప్రాంత ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయినులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular