గజ్వేల్ తహసీల్దార్‌పై కేటీఆర్ ఆగ్రహం…

తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 10(ద్రోణ):- భూమిని కాపాడాలని సాయం కోరిన రైతుతో గజ్వేల్ తహసీల్దార్ వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతుకు అండగా నిలవాల్సిన అధికారి, ‘ఇంకా పురుగుల మందు తాగలేదా?’ అంటూ వ్యాఖ్యానించడం అమానవీయమని ఆయన మండిపడ్డారు. రైతులు తమ భూములను కాపాడుకునేందుకు అధికారుల చుట్టూ తిరుగుతూ సమస్యల పరిష్కారం కోసం వేడుకుంటుంటే, వారికి భరోసా కల్పించాల్సిన అధికారులు ఇలా ఎగతాళి చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుల సమస్యలను సానుభూతితో వినాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకోకుండా, వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు. రైతుల పట్ల ఇలాంటి వైఖరిని సహించకూడదని, ఘటనకు బాధ్యుడైన గజ్వేల్ తహసీల్దార్‌పై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
