ఎంప్లాయిస్ యూనియన్‌కు జైకొట్టిన కార్మికులు!
నిజామాబాద్ జిల్లాలో ఎంప్లాయిస్ యూనియన్‌కు 1,516 ఓట్లు..
టీ,ఎం,యూ కు 1,404 ఓట్లు
రాష్ట్రవ్యాప్తంగా 10 వేలకుపైగా మెజారిటీతో విజయం..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు పోరాటం

ఏ,ఐ,టీ,యూ,సీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య
నిజామాబాద్, అక్టోబర్ 10(ద్రోణ):- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీ,జీ,ఎస్,ఆర్టీ,సీ)లో పదేళ్ల విరామం అనంతరం నిర్వహించిన కార్మిక సంఘాల ఎన్నికలలో ఎంప్లాయిస్ యూనియన్‌కు మద్దతుగా నిలిచిన కార్మికులకు ఏఐటీయూసీ నాయకులు విప్లవ జేజేలు పలికారు. కార్మికుల హక్కుల సాధన, సంక్షేమం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే లక్ష్యంతో సాగుతున్న పోరాటానికి ఈ విజయం మరింత బలాన్నిచ్చిందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎంప్లాయిస్ యూనియన్‌కు 1,516 ఓట్లు, టీఎంయూకు 1,404 ఓట్లు లభించాయని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ఏ, ఐ,టీ,యూ,సీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనతోపాటు ఎంప్లాయిస్ యూనియన్ రీజినల్ కార్యదర్శి రవిచందర్, అధ్యక్షుడు దశరథ్, టీఎంయూ కార్యదర్శి శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ మాట్లాడారు.

పదేళ్ల పోరాటానికి దక్కిన ఫలితం
ఈ సందర్భంగా వై. ఓమయ్య మాట్లాడుతూ.. ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణ కోసం కార్మికులు దశాబ్ద కాలంగా వివిధ రూపాల్లో పోరాటాలు సాగించారని తెలిపారు. యూనియన్ల రద్దు నుంచి తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు కార్మికులు తమ హక్కుల కోసం ఉద్యమించారని పేర్కొన్నారు. కార్మికుల ఒత్తిడి, నిరంతర పోరాటాల ఫలితంగానే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకొచ్చిందని అన్నారు. ఎన్నికలలో కార్మికులను భయ భ్రాంతులకు గురిచేయడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఆర్టీసీ కార్మికులు చైతన్యంతో తమ నిర్ణయాన్ని ఓటు రూపంలో వెల్లడించారని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం వంటి అంశాలపై ఎంప్లాయిస్ యూనియన్ మాత్రమే బలంగా పోరాడగలదనే నమ్మకంతో ఎర్రజెండాకు మద్దతు తెలిపారని చెప్పారు.
జిల్లాలో 1,516 ఓట్ల మద్దతు
నిజామాబాద్ జిల్లాలో ఎంప్లాయిస్ యూనియన్‌కు 1,516 ఓట్లు రాగా, టీఎంయూకు 1,404 ఓట్లు లభించాయని ఓమయ్య తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఏ,ఐ,టీ,యూ,సీ అనుబంధ ఎంప్లాయిస్ యూనియన్‌కు 10 వేలకుపైగా మెజారిటీ లభించిందని పేర్కొన్నారు. తమపై విశ్వాసంతో ఓట్లు వేసి విజయాన్ని అందించిన ఆర్టీసీ కార్మికులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాన్ని కేవలం ఎన్నికల విజయంగా కాకుండా, కార్మికుల ఆశలు, ఆకాంక్షలు, హక్కుల సాధన కోసం సాగుతున్న పోరాటానికి లభించిన ప్రజామద్దతుగా భావిస్తున్నామని అన్నారు. కార్మికులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని స్పష్టం చేశారు.
విలీనం సాధించే వరకు పోరాటం
ఎన్నికలలో విజయం అందించిన కార్మికుల సంక్షేమమే తమ కూటమి ప్రధాన లక్ష్యమని ఓమయ్య తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధన, ఉద్యోగ భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కార్మికుల చిరకాల ఆకాంక్షను నెర వేర్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, అవసరమైన పోరాటాలు కొనసాగిస్తామని ప్రకటించారు. కార్మికులకు ఇచ్చే నిజమైన బహుమతి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమేనని, ఆ లక్ష్యం సాధించే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. కార్మికులు అందించిన విజయాన్ని బాధ్యతగా తీసుకొని వారి సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి ఫిరోజ్, జిల్లా కార్యదర్శి గోవర్ధన్, ఉపాధ్యక్షుడు చక్రపాణి, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు లలిత, నరసయ్య, గంగాధర్, యూసుఫ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
