మ్యాచ్‌కు హెచ్,సీ,ఏ సర్వం సిద్ధం..

విద్యార్థులకు 2,500 ఉచిత టికెట్లు
హైదరాబాద్, అక్టోబర్ 10(ద్రోణ):- ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మరో అంతర్జాతీయ క్రికెట్ సమరానికి ముస్తాబైంది. భారత్–వెస్టిండీస్ జట్ల మధ్య ఈ నెల 14న జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కార్యదర్శి జీవన్‌రెడ్డి వెల్లడించారు. మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు భద్రత, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
ఆధునిక సదుపాయాలతో స్టేడియం
మ్యాచ్ నేపథ్యంలో స్టేడియంలోని ఫ్లడ్‌లైట్లు, ప్రేక్షకుల సీటింగ్ ఏర్పాట్లు, అవుట్‌ఫీల్డ్ డ్రైనేజీ వ్యవస్థలను ఆధునికీకరించినట్లు హెచ్‌సీఏ కార్యదర్శి వివరించారు. వర్షం కురిసిన సందర్భాల్లో మైదానంలో నీరు నిల్వ ఉండకుండా, ఆటకు అంతరాయం తగ్గించేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచినట్లు తెలిపారు. ప్రేక్షకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
విద్యార్థులకు ఉచితంగా 2,500 టికెట్లు
క్రికెట్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలలకు చెందిన సుమారు 2,500 మంది విద్యార్థులకు ఉచితంగా టికెట్లు అందించనున్నట్లు జీవన్‌రెడ్డి వెల్లడించారు. విద్యార్థులు ప్రత్యక్షంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం కల్పించడం ద్వారా క్రీడల పట్ల వారిలో ఆసక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న సైనిక అధికారులకు కూడా హెచ్‌సీఏ ప్రత్యేక ప్రాధాన్యం కల్పించింది. ఆర్మీ అధికారుల కోసం 250 టికెట్లు కేటాయించినట్లు కార్యదర్శి పేర్కొన్నారు.
పార్కింగ్, భద్రతపై ప్రత్యేక దృష్టి
మ్యాచ్‌ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పార్కింగ్ సామర్థ్యాన్ని పెంచినట్లు హెచ్‌సీఏ తెలిపింది. స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మల్కాజిగిరి పోలీసులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపడుతున్నట్లు జీవన్‌రెడ్డి వివరించారు. ప్రేక్షకుల రాకపోకలు సజావుగా సాగడంతో పాటు భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భారత్–వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, స్టేడియంలో ఏర్పాట్లు పూర్తిచేసిన హెచ్‌సీఏ మ్యాచ్ నిర్వహణకు సిద్ధమైంది. అంతర్జాతీయ క్రికెట్ సందడితో ఉప్పల్ స్టేడియం మరోసారి అభిమానులతో కళకళలాడనుంది.
