కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో 70 వాహనాలు సీజ్..

పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు
బోధన్, అక్టోబర్ 10(ద్రోణ):- నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల నీలా గ్రామంలో శనివారం సాయంత్రం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలలో బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు, బోధన్ టౌన్ సీఐ వెంకట్ నారాయణ, రుద్రూర్ సర్కిల్ సీఐ కృష్ణతో పాటు బోధన్ సబ్ డివిజన్‌కు చెందిన ఆరుగురు ఎస్సైలు, 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు బృందాలు ఆరు ప్రత్యేక టీమ్‌లుగా ఏర్పడి గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తుల వివరాలను పరిశీలించడంతో పాటు వాహనాల పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 70 వాహనాలను సీజ్ చేశారు. అవసరమైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు కూడా విధించారు. వాహనదారులు తప్పనిసరిగా సంబంధిత ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో నేరాల నియంత్రణ, ప్రజలలో భద్రతా భావం పెంపొందించడం, పోలీసులకు ప్రజలకు మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
