Sunday, October 11, 2026

చిల్లరే కొండంత సొమ్ము..

నాణేలతో స్కూటీ సొంతం!

చిల్లరతో స్కూటీ కొనుగోలు..

మూడేళ్ల పొదుపుతో కల నెరవేర్పు!

రూ.10 నాణేలతో రూ.1.23 లక్షలు జమ..

షోరూమ్‌లో రెండు గంటల పాటు లెక్కింపు

లక్షెట్టిపేట, అక్టోబర్ 11(ద్రోణ):- చిన్న మొత్తాల పొదుపుతోనూ పెద్ద కలలను సాకారం చేసుకోవచ్చని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన రవి జోసెఫ్ నిరూపించారు. స్కూటీ కొనాలనే తన కోరికను నెరవేర్చుకునేందుకు ఆయన వినూత్నంగా పొదుపు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మూడేళ్లుగా కూడబెట్టిన రూ.10 నాణేలతో కొత్త స్కూటీని కొనుగోలు చేయడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

లక్షెట్టిపేటలోని ఓ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న రవి జోసెఫ్‌కు సొంతంగా స్కూటీ కొనుగోలు చేయాలనే కోరిక ఉండేది. అయితే, ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చుకోవడం సాధ్యం కాకపోవడంతో తనకు అందుబాటులో ఉన్న మార్గంలో పొదుపు చేయాలని నిర్ణయించుకున్నారు. కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల కొనుగోళ్ల సమయంలో మిగిలే చిల్లరలోని రూ.10 నాణేలను ప్రత్యేకంగా దాచిపెట్టడం ప్రారంభించారు. రోజు రోజుకూ కూడిన ఆ నాణేలు మూడేళ్లలో పెద్ద మొత్తంగా మారాయి. ఇలా పొదుపు చేసిన నాణేల విలువ ఏకంగా రూ.1.23 లక్షలకు చేరింది. తన కలను నెరవేర్చుకునేందుకు ఆ మొత్తాన్ని తీసుకుని స్కూటీ షోరూమ్‌కు వెళ్లిన రవి జోసెఫ్, తాను కోరుకున్న కొత్త స్కూటీని కొనుగోలు చేశారు.

అయితే, ఆయన తీసుకొచ్చిన నాణేలను లెక్కించేందుకు షోరూమ్ సిబ్బందికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. సాధారణంగా పెద్ద నోట్లతో వాహనాలు కొనుగోలు చేయడం చూస్తుంటాం. అందుకు భిన్నంగా మూడేళ్లపాటు రూ.10 నాణేలను పొదుపు చేసి స్కూటీ కొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదాయం ఎంత ఉన్నా పొదుపు అలవాటు ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చనే సందేశాన్ని రవి జోసెఫ్ ప్రయత్నం అందిస్తోంది. చిన్న మొత్తాలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా దాచుకుంటే అవే భవిష్యత్తులో పెద్ద అవసరాలకు ఉపయోగపడతాయని ఆయన పొదుపు ప్రయాణం చాటిచెబుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular