Sunday, October 11, 2026

ఆడుకుంటూ అదృశ్యమైన ఆరేళ్ల చిన్నారి..

నీటి సంపులో మృతదేహం!

కిడ్నాప్‌ కలకలంతో బొల్లారంలో విషాదం..

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్‌, అక్టోబర్ 11(ద్రోణ):- బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో ఆరేళ్ల చిన్నారి అదృశ్యమై, చివరకు నీటి సంపులో విగతజీవిగా కనిపించడం తీవ్ర కలకలం రేపింది. కౌకూర్‌లోని విల్లా ఆర్చిడ్స్‌ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో ఆడుకుంటున్న అరులియా మోజెస్‌ (6) శనివారం అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో నీటి సంపులో మృతదేహంగా కనిపించినట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి మృతితో అపార్ట్‌మెంట్‌ వాసుల్లో విషాదం నెలకొంది.

సీసీటీవీ ఫుటేజీపై పోలీసుల దృష్టి

ఈ ఘటనకు సంబంధించి అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫుటేజీలో చిన్నారి వాచ్‌మన్‌తో కలిసి ఉన్న దృశ్యాలు కనిపించినట్లు సమాచారం. ఈ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. చిన్నారి అదృశ్యం వెనుక కారణాలు, మరణానికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. చిన్నారి మృతికి బాధ్యులెవరు? ఘటన ఎలా చోటుచేసుకుంది? అనే అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular