Sunday, October 11, 2026

అంగవైకల్యానికి ఆర్థిక కష్టాలు అడ్డుకాకూడదు!

బాన్సువాడలో కృత్రిమ అవయవాల పంపిణీకి కార్యాచరణ..

గ్రామాల వారీగా అర్హుల గుర్తింపునకు

పోచారం భాస్కర్‌రెడ్డి పిలుపు

బాన్సువాడ, అక్టోబర్ 11(ద్రోణ):- అంగవైకల్యంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఆర్థిక స్థోమత లేక అవసరమైన సహాయక పరికరాలను సమకూర్చుకోలేని వారికి చేయూతనిచ్చేందుకు బాన్సువాడ నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కృత్రిమ చేతులు, కాళ్లు అవసరమైన వారిని గుర్తించి, వారికి సహాయం అందించే దిశగా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి కార్యాచరణ రూపొందించారు. ఈ సేవలను నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి చేరువ చేయాలని నిర్ణయించారు.

ఇప్పటికే సెప్టెంబర్‌ 30న బాన్సువాడ పట్టణంలో ముగ్గురికి కృత్రిమ అవయవాలను అందించారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించి, అవసరమైన వారందరికీ ప్రయోజనం చేకూర్చేలా తదుపరి చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా దసరా పండుగ అనంతరం మండలాల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ

శిబిరాల నిర్వహణకు ముందుగా క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించడం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, ప్రజా ప్రతి నిధులు గ్రామాలలో పర్యటించి, అంగ వైకల్యం ఉన్నవారి వివరాలను సేకరించాలని పోచారం భాస్కర్‌రెడ్డి కోరారు. వారి ఫోన్‌ నంబర్లు, అంగ వైకల్యానికి సంబంధించిన వివరాలు, అవసరమైన కృత్రిమ అవయవాలు లేదా ఇతర సహాయక పరికరాల సమాచారాన్ని నమోదు చేసి అందించాలని సూచించారు.

సేవలు పొందేలా సమన్వయం

గ్రామాలలో అర్హులెవరూ మిగిలి పోకుండా గుర్తించడంతోపాటు, శిబిరాల సమాచారం వారికి చేరవేయాలని కోరారు. అవసరమైన వారిని శిబిరాలకు తీసుకువచ్చేలా స్థానిక నాయకులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక ఇబ్బందులతో అవసరమైన పరికరాలను పొందలేక పోతున్న వారికి సహాయం అందితే వారి జీవనంలో సానుకూల మార్పు వస్తుందని పేర్కొన్నారు. అంగవైకల్యం ఉన్నవారు ఇతరుల పై ఆధారపడకుండా తమకు సాధ్యమైన పనులు చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ఈ కార్యక్రమం తోడ్పడాలన్నదే లక్ష్యమని తెలిపారు. ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేసేందుకు అన్ని మండలాల నాయకులు, ప్రజా ప్రతి నిధులు సమష్టిగా పనిచేయాలని పోచారం భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular