భార్యకు పెళ్లి ఆశ చూపిన ఇన్‌స్పెక్టర్!
విడాకులు అయ్యాయని నమ్మించి సహజీవనం..

పెళ్లికి నిరాకరించాడంటూ బాధితురాలి ఫిర్యాదు
హైదరాబాద్, అక్టోబర్ 11(ద్రోణ):- అనారోగ్యంతో భర్త మంచానికే పరిమితమైన పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఓ మహిళకు పెళ్లి ఆశ చూపి శారీరక సంబంధం కొనసాగించారనే ఆరోపణలతో సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో డీఐ బాలస్వామిపై కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. భర్త అనారోగ్యంతో బాధపడుతుండటాన్ని గమనించిన బాలస్వామి ఆమెకు దగ్గరయ్యాడు. భర్త ఎక్కువ రోజులు బతకడని చెబుతూ, తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు ఆమె ఆరోపించింది.
ఈ క్రమంలో తన ఇంటికి వచ్చిన బాలస్వామి, ఆమెను తన గదికి తీసుకెళ్లి శారీరకంగా కలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అయితే, అతడికి అప్పటికే వివాహమైందని తెలుసుకున్న బాధితురాలు నిలదీయగా.. తనకు విడాకులు అయ్యాయని చెప్పి నమ్మించాడని ఆరోపించింది. ఆ తర్వాత కూడా పెళ్లి చేసుకుంటాననే మాటతో సంబంధాన్ని కొనసాగించినట్లు తెలిపింది. కొంత కాలం తర్వాత పెళ్లి చేసుకోవాలని కోరగా బాలస్వామి నిరాకరించాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో పోలీసుల తదుపరి విచారణలో వెల్లడయ్యే వివరాలపై ఆసక్తి నెలకొంది.
