Monday, October 12, 2026

కిరాయికి వెళ్లిన ఆటో డ్రైవర్‌ దారుణ హత్య!

అటవీ ప్రాంతంలో కుళ్లిన మృతదేహం…

దగ్ధమైన ఆటో లభ్యం

జహీరాబాద్‌, అక్టోబర్ 11(ద్రోణ):- కిరాయికి వెళ్లిన ఆటో డ్రైవర్‌ అనుమానాస్పద పరిస్థితులలో హత్యకు గురైన ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. అదృశ్యమైన మూడు రోజుల తర్వాత అటవీ ప్రాంతంలో అతడి మృతదేహం కుళ్లిన స్థితిలో లభించగా, సమీపంలో కాలిపోయిన ఆటోను పోలీసులు గుర్తించారు. ఈ ఘటన వెనుక గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మన్నాపూర్‌ గ్రామానికి చెందిన మున్నూరు శ్రీనివాస్‌ (48) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నెల 7వ తేదీన కిరాయి నిమిత్తం ఆటోతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర ప్రాంతాలలో, తెలిసినవారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో శనివారం జహీరాబాద్‌ మండలం తూంకుంట శివారులోని అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన మృతదేహం, కాలిపోయిన ఆటో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, అది అదృశ్యమైన శ్రీనివాస్‌ గా గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి ఉంటారని, అనంతరం ఆటోకు నిప్పంటించి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృత దేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైద్యులు ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీనివాస్‌ భార్య మహా దేవి ఫిర్యాదు మేరకు చిరాగ్‌ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితుల కోసం ప్రత్యేక బృందాలు

హత్యకు పాల్పడిన వారిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సమాచారం అందుకున్న జహీరాబాద్‌ పట్టణ సీఐ రాజబోయిన రవి, జహీరాబాద్‌ రూరల్‌ ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ బృందం ఆధారాలు సేకరించింది. హత్యకు పాత కక్షలు, ఆర్థిక లావాదేవీలు కారణమా? కిరాయి పేరుతో ఆటోను దొంగిలించేందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాల దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలించే పనిలో ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular