మహిళ మృత దేహం వెలికితీత
ధర్మారంలో ఘటన..

తహసీల్దార్ సమక్షంలో పోస్టు మార్టం
పెద్దపల్లి,అక్టోబర్ 11(ద్రోణ):- పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మృతురాలి కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి అంత్యక్రియలు నిర్వహించడంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ధర్మారం మండల కేంద్రానికి చెందిన గంగాధర లక్ష్మి శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదే రోజు రాత్రి సుమారు 7 గంటల సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అయితే లక్ష్మి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అదే కాలనీకి చెందిన ఆమె దగ్గర బంధువు సింగిరెడ్డి సరోజన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ కుటుంబ కలహాల నేపథ్యంలో అత్త, కోడళ్ల మధ్య తరచూ గొడవలు జరిగేవని, ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలో లక్ష్మి మృతి పై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకున్న పోలీసులు ఆదివారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. తహసీల్దార్ డి. శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కార్తీక్ సమక్షంలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పోస్టు మార్టం నివేదిక వచ్చిన తర్వాత లక్ష్మి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని సీఐ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
