14 లేదా 15న నోటిఫికేషన్?
మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే యోచన..

కూటమి అభ్యర్థుల గెలుపుపై
మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతి, అక్టోబర్ 11(ద్రోణ): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై కసరత్తు వేగవంత మైనట్లు సమాచారం. ఈ నెల 14 లేదా 15 తేదీలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాలలో సాగుతోంది. నవంబర్ 30లోపు మూడు దశలలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
రిజర్వేషన్ల పై స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల పై ఎన్నికల సంఘం దృష్టి సారించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈ నెల 13న రాజకీయ పార్టీల ప్రతి నిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం ఎన్నికల షెడ్యూల్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరో వైపు స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని అధికార కూటమి ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా పార్టీ పరంగా సన్నద్ధతను ప్రారంభించినట్లు సమాచారం. నోటిఫికేషన్ వెలువడితే గ్రామాలు, పట్టణాలలో రాజకీయ సందడి మరింత పెరిగే అవకాశముంది.
కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రులదే!
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. కూటమిలోని మూడు పార్టీల మధ్య సమన్వయం ఉండాలని, ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయా జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్న మంత్రులు ఎన్నికల నిర్వహణ, పార్టీ శ్రేణుల సమన్వయం పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించినట్లు సమాచారం.
ఎన్నికలలో అన్ని స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం సూచించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ 15 నాటికి ఎన్నికలకు సంబంధించిన పార్టీ పనులను పూర్తి చేసుకుని తిరిగి సాధారణ విధులపై దృష్టి సారించాలని మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది.
అయితే ఎన్నికల నోటిఫికేషన్, పోలింగ్ తేదీలు, దశల వారీ షెడ్యూల్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది.
