Monday, October 12, 2026

26 ఏళ్ల తర్వాత..

ఒక్కచోట చేరిన పూర్వ విద్యార్థులు!

గురువులతో చిన్ననాటి జ్ఞాపకాల నెమరువేత..

పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని హామీ

బోధన్, అక్టోబర్ 11(ద్రోణ):- చదువుకున్న రోజులు.. గురువుల బోధనలు.. స్నేహితులతో గడిపిన మధుర జ్ఞాపకాలు.. ఇలా ఎన్నో అనుభూతులను గుర్తుచేసుకుంటూ బసవతారకనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 1999–2000 పదో తరగతి పూర్వ విద్యార్థులు శనివారం ఆత్మీయ సమ్మేళనంలో సందడి చేశారు. దాదాపు 26 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకున్న వారు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కలిసి ఆప్యాయంగా పలకరించి, వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నాగేష్ బాబు, గోపీచంద్, నరేంద్రలు పూర్వ విద్యార్థులతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి, ఇన్నేళ్ల తర్వాత తమను గుర్తుంచుకుని కుటుంబాలతో సహా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నాగేష్ బాబు అన్నారు. పూర్వ విద్యార్థులు చూపిన ఆప్యాయత, గురువుల పట్ల ప్రదర్శించిన గౌరవం సంతోషాన్ని కలిగించాయని గోపీచంద్, నరేంద్రలు పేర్కొన్నారు. తాము విద్యనభ్యసించిన పాఠశాలతో తమకు విడదీయలేని అనుబంధం ఉందని పూర్వ విద్యార్థులు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు నీలం కుమారస్వామి, మహేందర్, శంకరప్ప, త్రివేణి, భాగ్యలక్ష్మి, శశికళ, లావణ్య, లలిత, రాజు, రియానంద్, నరేష్, నాగూరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular