Monday, October 12, 2026

బాన్సువాడలో బతుకమ్మ సంబరాలు..

44 అడుగుల భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ!

చందూర్‌లోనూ అంబరాన్నంటిన వేడుకలు..

ముఖ్య అతిథులుగా పోచారం శ్రీనివాసరెడ్డి, కాసుల బాలరాజు

బాన్సువాడ, అక్టోబర్ 11ద్రోణ:- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు బాన్సువాడ పట్టణంతో పాటు చందూర్ మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా జరిగాయి. బాన్సువాడ పట్టణంలోని వెయ్యి డబుల్ బెడ్‌రూం ఇళ్ల కాలనీలో, చందూర్ మండల కేంద్రంలోని విక్టరీ మోడల్ పాఠశాలలో నిర్వహించిన వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

బాన్సువాడలో ఏర్పాటు చేసిన 44 అడుగుల భారీ బతుకమ్మ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద బతుకమ్మగా నిర్వాహకులు పేర్కొన్న ఈ భారీ బతుకమ్మను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది.

బాన్సువాడ, చందూర్ ప్రాంతాలకు చెందిన మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో వేడుకల్లో పాల్గొని, బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, తెలంగాణ ఆడపడుచుల ఐక్యతను, ఆత్మీయతను, పూల పండుగ విశిష్టతను చాటిచెప్పారు.

ప్రకృతితో మమేకమైన తెలంగాణ జీవన సంస్కృతికి బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఈ వేడుకలు మరోసారి చాటిచెప్పాయి. మహిళల ఆటపాటలు, ఉత్సాహభరిత వాతావరణం మధ్య సంబరాలు అంగరంగ వైభవంగా సాగాయి.

ఈ కార్యక్రమాల్లో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular