Sunday, October 11, 2026

ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు అమలు చేసే అధికారాలు కల్పించాలి

రాజ్యాంగ సవరణ కోసం ఉద్యమించాలి..

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, అక్టోబర్ 11(ద్రోణ):- ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు కేవలం సిఫారసులకే పరిమితమైన అధికారాలు కాకుండా, తమ ఆదేశాలను అమలు చేయించగలిగే చట్టబద్ధమైన అధికారాలు కల్పించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇందుకోసం రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు.

దేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్లు సహా పలు కమిషన్లు సలహాలు, సిఫారసులు చేసే సంస్థలుగానే మిగిలిపోతున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్లకు రాజకీయ నాయకులు లేదా విశ్రాంత న్యాయమూర్తులు చైర్మన్లుగా ఉన్నప్పటికీ, వాటి నిర్ణయాలను అమలు చేయించే అధికారాలు లేకపోతే ఆశించిన ప్రయోజనం ఉండదన్నారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు సమర్థవంతమైన అధికారాలు కల్పించే దిశగా తగిన చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు.

కమిషన్లు ఇచ్చే తీర్పులు, సిఫారసులు అమలుకు నోచుకోకపోవడంతో బాధిత వర్గాలకు న్యాయం అందడం లేదని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఓ ఉద్యోగి పదోన్నతికి సంబంధించి ఎస్సీ కమిషన్ ఇచ్చిన నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయగా, దాన్ని అమలు చేయాలన్న నిబంధన లేదనే కారణంతో ఆ నిర్ణయం అమలుపై సమస్య తలెత్తిందని వివరించారు. నేరెళ్ల ఘటనకు సంబంధించి ఇప్పటికీ ఎస్సీ కమిషన్ నివేదిక ఇవ్వలేదని, ఒకవేళ నివేదిక ఇచ్చినా దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలనే నిర్బంధ నిబంధనలు లేకపోతే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. కమిషన్లు పళ్లులేని పులుల్లా మారిపోతున్నాయని వ్యాఖ్యానించారు.

ఈసీ, సెబీ తరహా అధికారాలు అవసరం

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయం జరగాలంటే కమిషన్లు ఇచ్చే ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకునేలా చట్టపరమైన వ్యవస్థ ఉండాలని కవిత అన్నారు. ఎన్నికల సంఘం, భారత పోటీ సంఘం, సెబీ వంటి సంస్థలకు చట్టం కల్పించిన అధికారాల తరహాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు కూడా సమర్థవంతమైన అధికారాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. మహిళా కమిషన్, బాలల కమిషన్, మానవ హక్కుల కమిషన్లు కూడా ప్రధానంగా సిఫారసులకే పరిమితమవుతున్నాయని పేర్కొన్నారు.

సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణకు పనిచేసే సంస్థలకు తగిన అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపార రంగానికి సంబంధించిన సంస్థలకు విస్తృత అధికారాలు ఉన్నప్పుడు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసే కమిషన్లకు కూడా బలమైన చట్టపరమైన అధికారాలు ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఎదిగేందుకు సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేస్తాం

తెలంగాణలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్ ఉందని, ఈ రెండు వర్గాల సమస్యలు భిన్నంగా ఉంటాయని కవిత పేర్కొన్నారు. అందువల్ల ఎస్సీలకు, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రెండు వర్గాలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అప్పటివరకు ఈ డిమాండ్ సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.

కేంద్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఉండేవని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు కమిషన్లను కలిపి ఒకటిగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఎస్సీలు ఎదుర్కొంటున్న కుల వివక్ష, దోపిడీ, దాడులు, అవమానాలు ఒక రకంగా ఉంటే, ఆదివాసీ గిరిజనుల సమస్యలు మరో రకంగా ఉంటాయని వివరించారు. ఆయా వర్గాల సమస్యలపై అవగాహన, ప్రజల బాధలు తెలిసిన వ్యక్తులు కమిషన్లకు నాయకత్వం వహిస్తే న్యాయం అందే అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు.

రాజకీయాల్లో కొందరు తప్పులు చేసినంత మాత్రాన మొత్తం వ్యవస్థను తప్పుబట్టడం సరికాదని పేర్కొన్న కవిత, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తులను కమిషన్ చైర్మన్లుగా నియమించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే వ్యక్తుల నియామకాలకంటే ముందుగా కమిషన్లకు చట్టబద్ధంగా నిర్ణయాలు అమలు చేయించే అధికారాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ కోసం ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చి, అన్ని వర్గాలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular