Tuesday, October 13, 2026

బాల్య వివాహాలలో భారత్‌ది ఆందోళనకర స్థానం!

ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూడు

బాల్య వివాహాలలో ఒకటి భారత్‌లోనే..

యునిసెఫ్‌ నివేదికలో వెల్లడి

హైదరాబాద్, అక్టోబర్ 12(ద్రోణ):- ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాల సమస్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రతి మూడు సెకన్ ల ఒక బాల్య వివాహం జరుగుతోందని యునిసెఫ్‌ నివేదిక వెల్లడించి నట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న బాల్య వివాహాలలో ప్రతి మూడు వివాహాలలో ఒకటి భారత్‌లోనే జరుగుతుండటం ఆందోళనకరంగా మారింది.

దేశంలో కోట్లాది మంది యువతులకు 18 ఏళ్లు నిండక ముందే వివాహాలు జరిగినట్లు నివేదికలో పేర్కొన్న గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో గణనీయమైన సంఖ్యలో బాలికలకు 15 ఏళ్లు నిండక ముందే పెళ్లిళ్లు జరిగినట్లు తెలిపింది. బాలికల విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత స్వేచ్ఛ, భవిష్యత్తు పై బాల్య వివాహాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో బాల్య వివాహాల సమస్య అధికంగా ఉన్నట్లు నివేదిక పేర్కొన్నట్లు సమాచారం. పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక సంప్రదాయాలు, బాలికల భద్రత పై ఆందోళనలు వంటి అంశాలు బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి.

బాల్య వివాహాల నివారణకు చట్టాల అమలు తోపాటు ప్రజలలో అవగాహన పెంచడం, బాలికల విద్యను ప్రోత్సహించడం, కుటుంబాలకు సామాజికంగా, ఆర్థికంగా అండగా నిలవడం కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. బాలికలకు విద్య, సమాన అవకాశాలు కల్పించి, బాల్య వివాహాల నుంచి వారిని రక్షించినప్పుడే ఈ సమస్యను సమర్థంగా అరికట్టే అవకాశం ఉంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular