Tuesday, October 13, 2026

జీజీహెచ్‌లో 750 పడకలకు బడ్జెట్ పెంచాలి!

కార్మికులపై పనిభారం తగ్గించాలి..

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా…

ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం

నిజామాబాద్, అక్టోబర్ 12(ద్రోణ):- నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్‌)లో రోగుల సంఖ్యకు అనుగుణంగా పడకల బడ్జెట్‌ను తక్షణమే 750 పడకలకు పెంచాలని, సిబ్బంది, కార్మికులపై పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్‌ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములుకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య, యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు పి. సుధాకర్‌ మాట్లాడుతూ.. జీజీహెచ్‌కు ప్రతిరోజూ సుమారు 2,500 మంది ఔట్‌పేషెంట్లు వస్తుండగా, 200 మందికి పైగా ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారని తెలిపారు. రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందుకు తగిన స్థాయిలో పడకలు, సిబ్బంది సదుపాయాలు కల్పించకపోవడంతో కార్మికులపై పని ఒత్తిడి అధికమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎంసీహెచ్‌ భవనంలో విధులు నిర్వహించే సిబ్బంది, కార్మికులు తీవ్ర పనిభారాన్ని ఎదుర్కొంటున్నారని, దీని ప్రభావంతో వారి ఆరోగ్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు.

గతంలో ప్రభుత్వం, వైద్యశాఖ నిర్ణయించిన మేరకు జీజీహెచ్‌లో పడకల బడ్జెట్‌ను వెంటనే 750కు పెంచాలని వారు కోరారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు, విధులు నిర్వహించే కార్మికులకు పని భారం తగ్గేలా తగిన సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కార్మికుల వేతనాల టెండర్‌ కాలపరిమితి ముగిసి ఏడాది గడిచినా సమస్యలు పరిష్కారం కాలేదని యూనియన్‌ నాయకులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, దాని ద్వారా కార్మికులకు వేతనాలు చెల్లించే విధానాన్ని అమలు చేయాలని కోరారు. అదేవిధంగా జాతీయ సెలవులు, పండుగ సెలవులు, ఆర్జిత సెలవులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం, వైద్యశాఖ అధికారులు తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ధర్నాలో యూనియన్‌ కోశాధికారి డి. భాగ్యలక్ష్మి, నాయకులు స్వరూప, భారతి, కవిత, సాయి, సునీత, సఫియాతో పాటు శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular