కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి
నిజామాబాద్, అక్టోబర్ 12 :ద్రోణ
రాబోయే రబీలో వరి సాగు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని, తక్కువ నీటితో సాగయ్యే పంటను సాగు చేసుకుని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు.
ఎల్ నినో నేపథ్యంలో రైతులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రబీ పంటల ప్రణాళిక, పంటల మార్పిడి , అనువైన పంటల ఎంపిక, సాగు పద్ధతులు, పంటల యాజమాన్యం తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులను సమన్వయపర్చి క్షేత్రస్థాయిలో రైతులు పంటల వైవిధ్యీకరణ అవలంభించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులపై
రైతులకు అవగాహన కల్పించేందుకు వీలుగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రైతు వేదికల ద్వారా రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, ఇతర వ్యవసాయ, ఉద్యానవన, వాతావరణ, విద్యుత్, భూగర్భజలాలు తదితర శాఖల అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక నుండి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ భుజంగరావు తదితరులు కలెక్టర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. అధిక లాభాలు అందించే ఆయిల్ పామ్ పంట దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఎల్ నినో ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేశామని అన్నారు. వ్యవసాయ ఉద్యానవన, విద్యుత్, నీటి పారుదల తదితర శాఖల అధికారులను సమన్వయం చేస్తూ, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నవీన్ అనే ఆదర్శ రైతు తన అనుభవాలను పంచుకున్నారు. ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఖరీఫ్ సీజన్ లో తాను వరికి బదులుగా కంది, పెసర, మినుము వంటి పప్పుదినుసు పంటలు సాగు చేయడం ద్వారా అధిక లాభాలు ఆర్జించడం జరిగిందన్నారు.
కాగా, ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రపంచ వాతావరణ సంస్థ నివేదికల ప్రకారం ఎల్‌నినో ప్రభావం డిసెంబర్ నాటికి గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని, 2027 వరకు ఇలాంటి పరిస్థితులు కొనసాగవచ్చని అంచనాలు ఉన్నట్లు తెలిపారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం కారణంగా ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని గత నాలుగు నెలలుగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, జిల్లా యంత్రాంగం ద్వారా రైతులను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువుల్లో అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. సాగులో ఉన్న పంటలను కాపాడుకోవడంతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు తక్కువ నీటితో, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలను సాగు చేయాలని అన్నారు. నీటి లభ్యత లేని ప్రాంతాల్లో పంటలు సాగు చేసి నష్టపోవద్దని, కొత్తగా నాటిన ఉద్యాన పంటలను కాపాడుకోవాలని సూచించారు. ఎల్‌నినోపై వచ్చే వదంతులను నమ్మకుండా, రైతులు, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు సమన్వయంతో వ్యవహరించి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకరించాలని కోరారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎల్‌నినో పరిస్థితులపై రైతులను ముందుగానే అప్రమత్తం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 15 లక్షల ఎకరాల మేర వరి సాగు విస్తీర్ణం తగ్గిందని పేర్కొన్నారు. సాగులో ఉన్న పంటలను కాపాడుకోవడంతో పాటు రబీలో పప్పుదినుసులు, నూనెగింజలు, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. విద్యుత్ సరఫరా, భూగర్భ జలాల లభ్యతపై వాస్తవ పరిస్థితులను రైతులకు తెలియజేయాలని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, వాతావరణ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, పశుసంవర్ధక శాఖల అధికారులు ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆయా శాఖల ద్వారా చేపట్టనున్న చర్యలను వివరించారు.
రైతు నేస్తం కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ విజయ కుమారి, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.



