రైతు నేస్తం 110వ ఎపిసోడ్‌లో రైతులకు ప్రభుత్వ పిలుపు
హైదరాబాద్, అక్టోబర్ 12:ద్రోణ
ఎల్ నినో ప్రభావంతో రాబోయే యాసంగి (రబీ) సీజన్‌లో వర్షపాతం తగ్గి, భూగర్భ జలాలు మరింత అడుగంటే అవకాశం ఉంది.అందువల్ల రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని, తక్కువ నీటితో తక్కువ కాలంలో పండే పంటలను ఎంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. సోమవారం నిర్వహించిన “రైతు నేస్తం” ప్రత్యేక కార్యక్రమం 110వ ఎపిసోడ్‌లో భాగంగా జరిగిన ఓవీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నుంచి రైతులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడుతూ, భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే నెలల్లో ఎల్ నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గి, తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. జలాశయాల్లో పూర్తిస్థాయి నిల్వలు లేనందున వానాకాలంలో వరి, పత్తి విస్తీర్ణం తగ్గిందని చెప్పారు. వానాకాలానికి ముందు నుంచే రైతులను సంసిద్ధులను చేయడంతో పప్పుధాన్యాల విస్తీర్ణం పెరిగిందని వివరించారు.యాసంగిలో పరిస్థితి మరింత తీవ్రమై భూగర్భ జలాలు అడుగంటే అవకాశం ఉన్నందున, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి వేయవద్దని కోరారు. అన్ని శాఖల సమన్వయంతో వాస్తవ పరిస్థితులపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు.
వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ మరియు వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ, ఎల్ నినో నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పంటల సరళి, పప్పుధాన్యాల విస్తీర్ణం పెరుగుదల, వరి విస్తీర్ణం తగ్గుదల వంటి వివరాలను తెలియజేశారు. ఈ యాసంగిలో నూనెగింజలు, పప్పుధాన్యాల పంటలకు సబ్సిడీ అందించి, రైతులను ఆ పంటల వైపు మళ్లిస్తామని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎల్ నినో పరిస్థితులపై గత ఆరు నెలలుగా ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమై రైతులకు సాంకేతిక సలహాలు అందిస్తోందన్నారు. ప్రస్తుత వాతావరణ ప్రభావంతో పంటలకే కాకుండా తాగునీటికి కూడా కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రైతులు తమ పొలాల్లోని భూగర్భ జలాలు, నీటి వసతిని పరిశీలించుకుని, దానికి అనుగుణంగా పంటలు సాగు చేయాలని సూచించారు. వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. నీటిని ఆదా చేసే డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మసేద్య పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు.నవంబర్‌లో వర్షాలు కురిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నందున, “రైతు నేస్తం” కార్యక్రమం ద్వారా ప్రతి వారం వాతావరణ సమాచారాన్ని రైతులకు అందిస్తామని తెలిపారు. రైతులు సరైన నిర్ణయం తీసుకునేలా అన్ని శాఖలు కలిసి కృషి చేయాలని సూచించారు. నీటిపారుదల శాఖ, భూగర్భ జల శాఖ, విద్యుత్ శాఖల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను రైతులకు వివరించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫోన్ ద్వారా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయ సంచాలకులు డాక్టర్ బి. గోపి, ఐఏఎస్, ఇతర రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఈ ఎపిసోడ్‌లో భారత వాతావరణ శాఖ (హైదరాబాద్) శాస్త్రవేత్త-డి డాక్టర్ శ్రావణి ఎల్ నినో ప్రభావం, వాతావరణ మరియు వర్షపాత పరిస్థితులను వివరించారు. యాసంగికి అనుకూలమైన పంటలపై ఆర్.ఏ.ఆర్.ఎస్. పాలెం ప్రధాన శాస్త్రవేత్త (నూనెగింజలు) డాక్టర్ డి. శశిభూషణ్, ప్రధాన శాస్త్రవేత్త (పప్పుధాన్యాలు) డాక్టర్ కె. రుక్మిణీ దేవి, సిడాట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహదేవప్ప, ఎస్.కె.ఎల్.టి.జి.హెచ్.యు. కూరగాయల శాస్త్రవేత్త డాక్టర్ జె. శ్రీనివాస్ రైతులకు సూచనలు అందించారు. అనంతరం శాస్త్రవేత్తలతో రైతుల ముఖాముఖి, ఎల్ నినో పరిస్థితులు, రబీ పంటల ప్రణాళికపై చర్చ జరిగింది.


