ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ముప్పు..
స్వల్పకాలిక పంటల వైపు రైతులు మళ్లాలి

రైతు నేస్తం 110వ ఎపిసోడ్‌లో ప్రభుత్వ సూచన
హైదరాబాద్, అక్టోబర్ 12 (ద్రోణ): యాసంగి సీజన్‌లో వరి సాగుకు దూరంగా ఉండి, తక్కువ నీటితో తక్కువ కాలంలో చేతి కొచ్చే పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే నెలల్లో వర్షపాతం తగ్గి, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, దీని వల్ల భూగర్భ జల మట్టాలు మరింత పడిపోయి సాగు నీటితో పాటు తాగు నీటి సమస్య కూడా తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైతులు తమ ప్రాంతాలలో ని నీటి లభ్యతను బట్టి పంటల ఎంపిక చేసుకోవాలని స్పష్టం చేసింది.
సోమవారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ 110వ ఎపిసోడ్‌లో భాగంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు రైతులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొనగా, రైతు వేదికల నుంచి రైతులు కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

నీటి లభ్యతను బట్టే పంటల ఎంపిక
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే నెలల్లో ఎల్‌నినో ప్రభావం తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగి వర్షపాతం తగ్గితే కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే జలాశయాల్లో పూర్తి స్థాయి నీటి నిల్వలు లేకపోవడంతో వానాకాలంలో వరి, పత్తి సాగు విస్తీర్ణం తగ్గిందని వివరించారు. రైతులకు ముందస్తుగా అవగాహన కల్పించడం వల్ల పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగిందని పేర్కొన్నారు.
యాసంగిలో నీటి కొరత మరింత తీవ్రం కావచ్చన్న అంచనాల నేపథ్యంలో వరి సాగుకు స్వస్తి పలికి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. పరిస్థితుల తీవ్ర తను రైతులకు వివరించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

పప్పుధాన్యాలు, నూనెగింజలకు ప్రోత్సాహం
వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ మాట్లాడుతూ, ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని తెలిపారు. యాసంగిలో పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించేందుకు సబ్సిడీలు అందించి రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించనున్నట్లు వెల్లడించారు.
వరి సాగుకు అవసరమైన నీటి పరిమాణంతో పోలిస్తే తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవడం ద్వారా అందుబాటులో ఉన్న జల వనరులను సమర్థంగా వినియోగించుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.

తాగునీటికీ కొరత వచ్చే ప్రమాదం
ఎల్‌నినో ప్రభావం పై ప్రభుత్వం గత ఆరు నెలలుగా అప్రమత్తంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు ముందస్తుగానే సాంకేతిక సలహాలు అందిస్తున్నామని చెప్పారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారితే పంటలకే కాకుండా తాగు నీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
రైతులు తమ పొలాల్లో భూగర్భ జలాల లభ్యత, సాగు నీటి వసతులను పరిశీలించిన తర్వాతే పంటలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వరికి బదులుగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. నీటి వినియోగాన్ని తగ్గించేందుకు బిందు సేద్యం, తుంపర సేద్యం వంటి సూక్ష్మసేద్య పద్ధతుల పై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
నవంబర్‌లో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ‘రైతు నేస్తం’ కార్యక్రమం ద్వారా ప్రతి వారం వాతావరణ సమాచారాన్ని రైతులకు అందిస్తామని మంత్రి తెలిపారు. రైతులు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేలా వ్యవసాయ, నీటిపారుదల, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

వాతావరణ పరిస్థితులపై శాస్త్రవేత్తల వివరణ
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫోన్ ద్వారా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణి ఎల్‌నినో ప్రభావం, రానున్న కాలంలో వాతావరణ, వర్షపాత పరిస్థితులను వివరించారు. యాసంగికి అనుకూలమైన పంటల పై ఆర్‌ఏఆర్‌ఎస్ పాలెం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ డి. శశిభూషణ్ (నూనెగింజలు), డాక్టర్ కె. రుక్మిణీ దేవి (పప్పుధాన్యాలు), సిడాట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహదేవప్ప, ఎస్‌కేఎల్‌టీజీహెచ్‌యూ కూరగాయల శాస్త్రవేత్త డాక్టర్ జె. శ్రీనివాస్ రైతులకు సూచనలు అందించారు. అనంతరం శాస్త్రవేత్తలు, రైతుల మధ్య ముఖాముఖి నిర్వహించి ఎల్‌నినో పరిస్థితులు, రబీ పంటల ప్రణాళికపై చర్చించారు. వ్యవసాయ సంచాలకులు డాక్టర్ బి. గోపి, ఐఏఎస్‌తో పాటు వివిధ శాఖల రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.
