హెచ్,ఎం,డీ,ఏ లేఅవుట్ సర్వే నివేదిక
కోసం రూ.30 లక్షల డిమాండ్….

ఏసీబీ వలలో తహశీల్దార్, మండల సర్వేయర్
హైదరాబాద్, అక్టోబర్ 13(ద్రోణ):- అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో మరో రెవెన్యూ అధికారి చిక్కారు. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహశీల్దార్ సుదర్శన్‌రెడ్డి, మండల సర్వేయర్ శ్రీనివాసులు రూ.20 లక్షల లంచం వ్యవహారంలో పట్టుబడ్డారు. హెచ్‌ఎండీఏ లేఅవుట్‌కు సంబంధించిన ఉమ్మడి తనిఖీ సర్వే నివేదిక జారీ చేసేందుకు అధికారులు రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. తహశీల్దార్ ఆదేశాల మేరకు ఫిర్యాదు దారుడి నుంచి మండల సర్వేయర్ శ్రీనివాసులు రూ.20 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో తహశీల్దార్ సుదర్శన్‌రెడ్డి పాత్ర పైన అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాలలో పనుల కోసం లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి చర్యలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
