కంటేశ్వర్ అండర్‌పాస్ విస్తరణ పనులు..

ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని పోలీసుల సూచన
నిజామాబాద్, అక్టోబర్ 13(ద్రోణ):- నగరంలోని కంటేశ్వర్ రైల్వే అండర్‌పాస్ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి జెడ్పీ చౌరస్తా, కంటేశ్వర్ బైపాస్ వైపు వెళ్లే మార్గంలో ఒకవైపు ఉన్న రైల్వే అండర్‌పాస్ విస్తరణ పనులను దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్న నేపథ్యంలో అక్టోబర్ 16వ తేదీ ఉదయం నుంచి సుమారు 45 రోజుల పాటు ఆ మార్గాన్ని వాహనాల రాకపోకలకు మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సూచించారు.
నగరంలోకి వచ్చే వాహనాలకు పాత మార్గమే
ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి, హైదరాబాద్ వైపు నుంచి నిజామాబాద్ నగరంలోకి వచ్చే వాహనాలు కంటేశ్వర్ బైపాస్, కంటేశ్వర్ మీ సేవ మీదుగా ఇప్పటికే పనులు పూర్తయిన రైల్వే అండర్‌పాస్ మార్గాన్ని వినియోగించుకోవాలి. అక్కడి నుంచి ఎన్టీఆర్ చౌరస్తాకు చేరుకుని కుడివైపు తిరిగి రైల్వే స్టేషన్ ముందు నుంచి బస్టాండ్‌కు వెళ్లవచ్చు.
నగరం నుంచి బయటకు వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ దారులు
నిజామాబాద్ నుంచి ఆర్మూర్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులు దేవీ రోడ్డులోని రైల్వే ఫ్లైఓవర్‌ను ఉపయోగించుకోవాలి. అక్కడి నుంచి దుబ్బ శివాజీ విగ్రహం, దుబ్బ రోడ్డు మీదుగా దుబ్బ చౌరస్తాలోని శ్రీ మహాలక్ష్మి ఆలయం వద్ద ఎడమవైపు తిరిగి ఖానాపూర్ చౌరస్తాకు చేరుకోవచ్చు.
అలాగే దుబ్బ చౌరస్తాలోని శ్రీ మహాలక్ష్మి ఆలయం నుంచి నేరుగా జీజీ కళాశాల వద్ద ఉన్న యూ-టర్న్ వరకు వెళ్లి బైపాస్ మీదుగా కంటేశ్వర్ డీఎస్ చౌరస్తాకు చేరుకోవచ్చని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్, కామారెడ్డి వెళ్లేవారికి మరో మార్గం
హైదరాబాద్, కామారెడ్డి వైపు వెళ్లే వాహనదారులు ఎన్టీఆర్ చౌరస్తా, కోర్టు చౌరస్తా, పులాంగ్ చౌరస్తా మీదుగా మాధవనగర్ రైల్వే గేట్ దాటి మాధవనగర్ బైపాస్ నుంచి హైదరాబాద్ రోడ్డుకు చేరుకోవచ్చు.
బోధన్, బాన్సువాడ మార్గాల్లో యథావిధిగా రాకపోకలు
బోధన్, బాన్సువాడ, వర్ని వైపు వెళ్లే వాహనాలు ప్రస్తుతం వినియోగిస్తున్న పాత మార్గాల్లోనే రాకపోకలు కొనసాగించవచ్చు. అండర్‌పాస్ విస్తరణ పనులు సుమారు 45 రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి, సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
అత్యవసర సంప్రదింపు నంబర్లు
- నిజామాబాద్ ఆర్టీసీ కంట్రోల్ రూమ్: 9959226022
- పోలీస్ కంట్రోల్ రూమ్: 8712659700
- పోలీస్ కంట్రోల్ రూమ్ ల్యాండ్‌లైన్: 08462-226090
- నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ: 8712659842
— పోలీస్ పౌర సంబంధాల అధికారి, నిజామాబాద్
