ఎన్సీసీ శిక్షణ శిబిరంలో పాల్గొన్న సిపి
నిజామాబాద్ సెప్టెంబర్ 14, ద్రోణ
విద్యార్థి దశ నుండే యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తిని అలవర్చుకోవాలని, యువతతోనే దేశ రక్షణ సాధ్యమని నిజామాబాద్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు.
12వ బెటాలియన్ ఎన్సీసీ (నేషనల్ క్యాడెట్ కార్ప్స్), నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక శిక్షణ శిబిరం అక్టోబర్ 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిజామాబాద్లోని సీటీసీ (CTC)లో కొనసాగుతోంది.
ఈ శిక్షణ శిబిరంలో మొత్తం 550 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొంటుండగా , వారికి వివిధ అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు.
ఈ శిబిరంలో భాగంగా బుధవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమానికి కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాడెట్లను ఉద్దేశించి పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ , సమయపాలన , బాధ్యతాయుత ప్రవర్తన , నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని , యువత సరైన విలువలతో ఎదిగినప్పుడే సమాజం , దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని పేర్కొన్నారు. యువతలో క్రమశిక్షణ , నాయకత్వ లక్షణాల అభివృద్ధికి ఎన్సీసీ దోహదం , ఎన్సీసీ శిక్షణ అనేది కేవలం శారీరక దృఢత్వానికి మాత్రమే పరిమితం కాకుండా , యువతలో మానసిక స్థైర్యం , ఆత్మవిశ్వాసం , క్రమశిక్షణ , ఐకమత్యం , నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించే సమగ్ర శిక్షణ కార్యక్రమంలో వివరించారు. బృంద స్ఫూర్తితో పనిచేయడం , కష్టసమయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం , ఇతరులకు సహాయపడటం , సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడం వంటి లక్షణాలు ప్రతి విద్యార్థికి అవసరమని సూచించారు. దేశసేవ , సామాజిక బాధ్యతపై అవగాహన ఎన్సీసీ క్యాడెట్లు శిక్షణ సమయంలో నేర్చుకునే క్రమశిక్షణ , సేవాభావం , దేశభక్తి వంటి విలువలను తమ జీవితాల్లో ఆచరణలో పెట్టాలని పోలీస్ కమిషనర్ సూచించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ , ప్రజలకు సహాయం చేయడం , విపత్తుల సమయంలో సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం వంటి అంశాల్లో యువత బాధ్యతాయుత పాత్ర పోషించాలని తెలిపారు. విద్యతో పాటు నైతిక విలువలు , సామాజిక స్పృహ కలిగి ఉన్నప్పుడే విద్యార్థులు భవిష్యత్తులో సమర్థవంతమైన పౌరులుగా ఎదగగలరని పేర్కొన్నారు.యువత ఎల్లప్పుడూ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని వారి వారి గ్రామాలలో ప్రజలను చైతన్యవంతులను చేయాలని అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని , ఈ సైబర్ నేరాల పట్ల తమ బంధుమిత్రులను కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయాలని తెలిపారు.550 మంది క్యాడెట్లకు శిక్షణ
అక్టోబర్ 9 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ వార్షిక శిక్షణ శిబిరంలో 550 మంది క్యాడెట్లకు శిక్షణ అందిస్తున్నారు. ఇటువంటి శిబిరాలు యువతలో క్రమశిక్షణతో పాటు దేశసేవ పట్ల నిబద్ధతను పెంపొందించడానికి, భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడానికి దోహదపడతాయి.
ఈ కార్యక్రమంలో 12వ బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ అధికారి విష్ణు పి. నాయర్ , సుబేదార్ మేజర్ రచ్పాల్ సింగ్ , సీటీసీ ఏసీపీ రాజశేఖర్ , బోధన్ ఏసీపీ శ్రీనివాస్ లు , బోధన్ రూరల్ సి ఐ విజయ్ బాబు , సి.టి.సి ఎస్.ఐ వరప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






